కరోనావైరస్: గో మూత్రం విందు, భలే పసందు
దేశ రాజధాని ఢిల్లీలో గోమూత్రం విందు జరిగింది. స్వామి చక్రపాణి మహరాజ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ ను తిప్పికొట్టడానికి ఇదే సరైన ఔషధం అని చెప్పడానికి గోమూత్రం విందును ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: పలువురు హిందూ కార్యకర్తలు శనివారం ఢిల్లీలో జరిగిన గోమూత్రం విందులో పాల్గొన్నారు. కరోనావైరస్ ను నివారించే శక్తి గోమూత్రానికి, పేడకు ఉందని హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అఖిల హిందూ మహాసభ ఆధ్వర్యంలో గోమూత్ర సేవనం విందును ఏర్పాటు చేశారు.
ఈ విందులో పింగామీ కప్పుల్లో గోమూత్రాన్ని, పేడను అందించారు. కరోనా వైరస్ ను నివారించే శక్తి గోమూత్రానికి, పేడకు ఉందని వాదిస్తూ వస్తున్న స్వామి చక్రపాణి తన వాదనకు బలం చేకూర్చునేందుకు ఈ విందును ఏర్పాటు చేశారు.
ఈ గోమూత్రం విందుకు దాదాపు 200 మంది హాజరయ్యారు. కరోనా వైరస్ ను నివారించే శక్తి గోమూత్రానికి, ఆవు పేడకు ఉందని అస్సాం బిజెపి ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ శాసనసభలో అన్న విషయం తెలిసిందే. గోమూత్రం, ఆవు పేడతో తయారు చేసిన పంచగవ్యతో గుజరాత్ లోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో క్యాన్సర్ పేషంట్లకు అందిస్తున్నారు.
కరోనా వైరస్ ను నివారించడానికి ఇప్పటి వరకు ఏ విధమైన మందులు కనిపెట్టలేదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలో ఇద్దరు మరణించారు. దాదాపు 89 కేసు కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ శాంతి కోసం తాము ఇక్కడ సమావేశమైన ప్రార్థించామని, కరోనాను శాంతింపజేయడానికి తాము ఈ పని చేస్తున్నామని స్వామి చక్రపాణి మహారాజ్ గోమూత్రం విందులో అన్నారు.