ప్రస్తుతం దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఎవరి నోట విన్నా.. రాజకీయల గురించే. ఇలాంటి పొలిటికల్ హీట్ లో తన ఆవు కవలలకు జన్మనిచ్చిందనే కారణంతో.. ఓ రైతు ఆ కవలలకు బీజేపీ, కాంగ్రెస్ గా నామకరణం చేశాడు. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్య ప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని కజూరీ కలాన్ గ్రామంలో గురువారం రాత్రి ఓ ఆవు.. రెండు దూడలకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో.. వాటికి బీజేపీ, కాంగ్రెస్ అనే పేర్లు పెట్టాడు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు..నిత్యం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు కదా.. ఆ రెండు పార్టీలనే పేర్లుగా ఎందుకు పెట్టారని ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు.. ఆ రైతు ఏమన్నాడంటే..

‘‘గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలు చేస్తున్న వాగ్దానాలు వింటూనే ఉన్నాం. ఎన్నికలు అయ్యే వరకే ఈ హామీలు ఉంటాయి. తర్వాత ఒక్క పార్టీ నేత కూడా కనిపించడు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడూ కలవవు. కనీసం ఈ కవల ఆవు దూడలన్నా.. కలిసి పెరుగుతాయి అందుకే ఆ పేర్లు పెట్టా అని చెప్పాడు. ఆవు కవలలకు జన్మనివ్వడం కూడా చాలా అరుదు’’అని  ఆ ఆవు యజమాని చెప్పాడు.