కోవిడ్-19 వ్యాక్సిన్ Covovaxకు సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో ఆధార్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. 12 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవోవాక్స్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
కోవిడ్-19 వ్యాక్సిన్ Covovaxకు సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో ఆధార్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. 12 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవోవాక్స్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘పెద్దలకు కోవోవాక్స్ అందుబాటులో ఉంటుందా?.. అని మీలో చాలా మంది తనను అడిగారు.. అంటే సమాధానం అవును. 12 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవోవాక్స్ అందుబాటులో ఉంది’’ అని పూనావాలా పేర్కొన్నారు. కోవోవాక్స్ భారతదేశంలోని పిల్లలకు అందుబాటులో ఉందని ప్రకటించిన మరుసటి రోజే అదార్ పూనావాలా ఈ ప్రకటన చేశారు.
భారతదేశంలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవోవాక్స్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని పూనావాలా మంగళవారం తెలిపారు. ‘‘Covovax (Novavax).. ఇప్పుడు భారతదేశంలోని పిల్లలకు అందుబాటులో ఉంది. ఇది భారతదేశంలో తయారు చేయబడిన ఏకైక టీకా.. ఇది యూరప్‌లో కూడా విక్రయించబడింది. ఇది 90 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంది. మన పిల్లలను రక్షించేందుకు మరో వ్యాక్సిన్ అందించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజన్‌కు ఇది అనుగుణంగా ఉంది’’ అని పూనావాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయబడిన ఉపయోగం కోసం భారత ప్రభుత్వం Covovaxని క్లియర్ చేసింది. ఇక, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) గత వారం 12-17 సంవత్సరాల వయస్సు గల వారికి కోవోవాక్స్ వ్యాక్సిన్‌ని ఆమోదించింది. దీంతో 12 నుంచి 17ఏళ్ల పిల్లలకు ప్రైవేట్ సెంటర్లలో కోవోవాక్స్ ఇచ్చేందుకు కోవిన్ పోర్టల్‌లో ఈ టీకాను చేర్చారు.
అయితే 18 ఏళ్లు పైబడిన వారికి కోవిన్ పోర్టల్‌లో కోవోవాక్స్ వ్యాక్సిన్ ఎంపిక అందుబాటులో లేదని పలువురు ట్టిట్టర్ వేదికగా పోస్టులు చేవారు. ‘‘Cowin పోర్టల్‌లో 18 ఏళ్లు.. అంతకంటే వయసు ఎక్కువ ట్యాబ్‌ని ఎంచుకుంటే Covovax ఎంపిక కనిపించడం లేదు. ఇది పరిశీలించబడుతుందని ఆశిస్తున్నాం’’ ఒక నెటిజన్ పేర్కొన్నారు. మరికొందరు ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే 12 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవోవాక్స్ అందుబాటులో ఉంటుందని ఆదార్ పూనావాలా క్లారిటీ ఇచ్చారు.
ఇక, భారత్‌లో ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గలవారికి కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు అనుమతించారు. 15 నుంచి18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రభుత్వ టీకా కేంద్రాలలో భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్‌ను అందజేస్తున్నారు. ఇక, మార్చి 16 నుంచి దేశంలో 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వ్యాక్సినేషన్ మొదలైంది. బయోలాజికల్ ఈ అభివృద్ది చేసిన కార్బెవాక్స్‌తో టీకాలు వేయడం ప్రారంభించారు. తాజాగా కోవోవాక్స్ కూడా 12 ఏళ్లు పైబడినవారికి అందుబాటులోకి వచ్చింది.
