Asianet News TeluguAsianet News Telugu

ఇక ప్రైవేట్ క్లినిక్‌లు, హాస్పిటళ్లలోనూ టీకాలు!.. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లకు మార్కెట్ విక్రయానికి అనుమతులు

కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ టీకాలకు అత్యవసర సమయంలో వినియోగానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. తాజా అనుమతులను కొన్ని షరతులతో కలిపి ఇచ్చింది. ఈ నిర్ణయంతో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు క్లినిక్‌లు, హాస్పిటళ్లలో వయోజనులకు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. దీంతో కావాల్సిన వారూ తమకు ఇష్టం ఉన్న హాస్పిటల్ వెళ్లి ఈ రెండింటిలో కోరిన టీకాను బూస్టర్ డోసుగా వేసుకునే వెసులుబాటు కలుగనుంది.

covishield covaxin gets regular market approvals from dcgi
Author
New Delhi, First Published Jan 27, 2022, 4:57 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్(Covishield), కొవాగ్జిన్(Covaxin) టీకాలకు రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వయోజనులకు కొన్ని షరతులతో పై రెండు టీకాలు ప్రైవేటులోనూ అందుబాటులోకి రానున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్విట్టర్‌లో వెల్లడించారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు భారత రెగ్యులేటర్ ఇచ్చిన అనుమతులను నవీకరించిందని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి ఇచ్చిన అనుమతులను విస్తరిస్తూ.. వయోజనులకు కొన్ని షరతులకు లోబడి అందేలా సాధారణ న్యూ డ్రగ్ పర్మిషన్‌లు ఇచ్చినట్టు వివరించారు. 

అయితే, ప్రభుత్వం చేపడుతున్న టీకా పంపిణీ కార్యక్రమం ఎప్పటిలాగే కొనసాగుతుంది. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు‌ల పంపిణీ జరుగుతుంది. అలాగే, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి అంటే.. హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులున్న వయోధికులకు బూస్టర్ డోసు ఎప్పటిలాగే అందించడం కొనసాగుతుంది. కానీ, తాజా అనుమతులతో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు త్వరలోనే క్లినిక్‌లు, హాస్పిటళ్లలో అందుబాటులోకి రానున్నాయి. అయితే, మెడికల్ స్టోర్స్‌లో ఇవి అందుబాటులో ఉండబోవని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్దేశించిన ధరలకు లోబడే ప్రైవేటు క్లీనిక్‌లలో ఈ టీకాలు అందుబాటులోకి వస్తాయని వివరించాయి. ముందు ముందు.. ఇన్నాళ్లు ప్రైవేటు హాస్పిటళ్లలో అందించిన ధరల కంటే తక్కువ ధరలకే టీకాలు వయోజనులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నాయి.

ఈ నిర్ణయంతో బూస్టర్ డోసు తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ మార్గంలో తీసుకోవచ్చు. ప్రైవేటు క్లీనిక్‌లకు వెళ్లి.. ఫస్ట్ డోసు లేదా సెకండ్ డోసు లేదా బూస్టర్ డోసులనూ క్లీనిక్‌లలో తీసుకోవచ్చు. అయితే, ఈ టీకాల వివరాలను ప్రతి ఆరు నెలలకు ఒక సారి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించాల్సి ఉంటుందనే కండీషన్ ఉన్నట్టు తెలిసింది. ఆ వివరాలను కొవిన్ యాప్‌లోనూ అప్‌డేట్ చేయాలని షరతులు ఉన్నట్టు సమాచారం. వీటికి తోడు టీకా తయారీదారులు.. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రయల్స్ ఫలితాలను వెల్లడించాలి. అలాగే, నిర్దేశిత నిబంధనలకు లోబడి సరఫరా చేస్తున్న టీకాల వివరాలనూ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, సైడ్ ఎఫెక్ట్‌లకు సంబంధించిన నిబంధనలూ అలాగే కొనసాగుతాయి.

తమకు రెగ్యులర్ మార్కెట్ అనుమతులు అందించాల్సిందిగా కోరుతూ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు చెందిన ప్రత్యేక నిపుణుల కమిటీ పరిశీలించింది. మరింత సమాచారాన్ని టీకా తయారీదారుల నుంచి కోరింది. ఆ సమాచారాన్నీ పరిశీలించిన తర్వాత ఆ రెండు టీకాలకు రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇవ్వాల్సిందిగా సిఫారసులు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా, డీసీజీఐ ఈ రెండు టీకాలకు రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇచ్చింది. దీంతో మార్కెట్‌ లోకి వయోజనులకు ఈ టీకాలు అందుబాటులోకి రానున్నాయి.

కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు గతేడాది జనవరి 3వ తేదీన అత్యవసర వినియోగ అనుమతులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios