Asianet News TeluguAsianet News Telugu

భారీగా తగ్గిన టీకా ధరలు.. ప్రైవేట్ హాస్పిటళ్లలో రూ. 225కే కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు

కొవిషీల్డ్ కొవాగ్జిన్ టీకా ధరలు భారీగా తగ్గాయి. ఈ రెండు టీకాలు ఇకపై ప్రైవేటు హాస్పిటిళ్లలో రూ. 225కే లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు అదర్ పూనావాలా, సుచిత్ర ఎల్లా ట్విట్టర్‌లో వెల్లడించారు.
 

covishield and covaxin price cut to rs 225 after consultaion with centre
Author
New Delhi, First Published Apr 9, 2022, 4:17 PM IST

న్యూఢిల్లీ: బూస్టర్ డోసులు 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ అందుబాటులోకి రానున్న ఒక రోజు ముందే మరో గుడ్ న్యూస్ వచ్చింది. ప్రైవేటు హాస్పిటళ్లలో టీకాల ధరలు భారీగా తగ్గనున్నాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు రూ. 225కే ప్రైవేట్ హాస్పిటళ్లలో అందుబాటులో ఉండనున్నాయి. కొవిషీల్డ్ టీకా ధర సగానికి ఎక్కువగా దిగి వచ్చింది. ఈ టీకా ధర రూ. 600గా ఉన్నది. దీన్ని సవరించిన తర్వాత సగానికి ఎక్కువగా తగ్గించి రూ. 225కు కుదించారు. కాగా, కొవాగ్జిన్‌కు కూడా అంతకంటే భారీగా ధర తగ్గించారు. కొవాగ్జిన్ ధరను రూ. 1200 నుంచి రూ. 225కి తగ్గించారు.

కొవిషీల్డ్ టీకా ధరను రూ. 225కు తగ్గించినట్టు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, కొవాగ్జిన్ ధరను తగ్గించినట్టు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీరిరువురూ తెలిపారు.

వయోజనులు అందరికీ ప్రికాషన్ డోసును అందుబాటులోకి తేవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వీరిద్దరూ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని పేర్కొన్నారు. అనంతరం టీకాల ధరలను సవరించారు. సవరించిన ధరలను వీరిద్దరూ ట్విట్టర్‌లో వెల్లడించారు.

 

ఈ నెల 8వ తేదీన మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వైరస్ ప్రికాషన్ డోస్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 10 నుంచి ప్రైవేట్ కేంద్రాల్లో ప్రికాషన్ డోస్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. 18 సంవత్సరాలను దాటిన వారు సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలల పూర్తి చేసుకున్న తర్వాత బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులు. ఇప్పటి వరకు దేశంలో 15 ఏళ్లు పైబడిన 96 శాతం మంది కనీసం ఒక డోస్ వ్యాక్సిన్‌ని తీసుకున్నారు. ఇదే సమయంలో 15 ఏళ్లు దాటిన వారిలో 83 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటు 60 ఏళ్లు దాటిన జనాభాలో 2.4 కోట్ల మందికి ప్రికాషన్ డోస్ అందించారు. 12 నుంచి 14 ఏళ్ల వయస్సు గల వారిలో 45 శాతం మంది కూడా ఫస్ట్ డోస్‌ను తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

అయితే, ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచిత టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios