children social skills: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. మానసికంగానూ పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా కోవిడ్-19 తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.
Smile Foundation Survey: కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది అనారోగ్యానికి గురయ్యారు. అయితే, ఈ సంఖ్యకంటే కరోనా వైరస్ కారణంగా మానసికంగా దెబ్బతిన్న వారు ఎక్కువగా ఉన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా కోవిడ్-19 అందరిపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని ఇప్పటికే పలు సర్వేలు పేర్కొన్నాయి. కరోనా నేపథ్యలో విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్ని అన్ని వయస్సుల వారిపై ప్రభావం పడిందనీ, ముఖ్యంగా చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపిందని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన మరో అధ్యయనం కోవిడ్-19 పాండమిక్ కారణంగా పిల్లల్లు సామాజిక నైపుణ్యాలను కోల్పోయారని పేర్కొంది. వారి అభ్యసనంపై ప్రభావం పడిందని తెలిపింది.
వివరాల్లోకెళ్తే.. కరోనా మహమ్మారి పిల్లలపై చూపిన ప్రభావాన్ని తెలుసుకోవడానికి స్మైల్ ఫౌండేషన్ ఓ సర్వే నిర్వహించింది. కనీసం 58 శాతం మంది ఉపాధ్యాయులు.. కోవిడ్-ప్రేరిత పాఠశాల మూసివేత సమయంలో పిల్లలు సామాజిక నైపుణ్యాలను కోల్పోయారని పేర్కొన్నారు. అలాగే, వారిలో శ్రద్ధ తగ్గడం వల్ల సులభంగా పరధ్యానానికి గురవుతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నారుల అభ్యాసనంపై కూడా ప్రభావం చూపిందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా చిన్నారుల అభ్యసన నష్టం, విద్య పునరుద్ధరణపై చేసిన సర్వే లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. COVID-19 మహమ్మారి తరువాత 50 శాతం కంటే తక్కువ మంది పిల్లలు వయస్సుకు తగిన అభ్యాసాన్ని పొందగలుగుతున్నారని సర్వే కనుగొంది.
స్మైల్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో 48,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇది 22 రాష్ట్రాలలోని పట్టణ, గ్రామీణ జిల్లాలను కవర్ చేసింది. “పిల్లలు సామాజిక నైపుణ్యాలను కోల్పోయారనీ, ఇప్పుడు సులభంగా పరధ్యానంలో ఉన్నారని యాభై ఎనిమిది శాతం మంది ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. వారి దృష్టి పరిధి తక్కువగా ఉందని పేర్కొంది. "సర్వే లో పాలుపంచుకున్న ఉపాధ్యాయుల ప్రకారం.. 50 శాతం కంటే తక్కువ మంది పిల్లలు గత రెండు సంవత్సరాలలో నేర్చుకునే నష్టాన్ని తట్టుకోగలిగారు. ప్రస్తుతం వారి వయస్సు-తగిన అభ్యాసాన్ని పొందగలుగుతున్నారు" అని అది పేర్కొంది. మహమ్మారికి ముందు కూడా క్రమం తప్పకుండా మంచి పనితీరు కనబరిచిన విద్యార్థులు వీరిలో ఎక్కువగా ఉన్నారు. అందువల్ల, మిగిలిన విద్యార్థులను వారి ఆశించిన అభ్యాస స్థాయికి సమానంగా తీసుకురావడానికి రాబోయే నెలల్లో కొంత సమయం, కృషి అవసరమని సర్వే పేర్కొంది.
తల్లిదండ్రులు తమ పరిధిలో పాఠశాలలు, విద్యా కార్యక్రమాల్లో పిల్లలను ఎక్కువగా పాల్గొనే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 47 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల్లో ఉపాధ్యాయులతో ఫోన్ కాల్‌ల ద్వారా పరస్పర చర్య ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. "ముప్పై ఎనిమిది శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలలను సందర్శించడం ద్వారా ఉపాధ్యాయులతో సంభాషించడం ప్రారంభించారు. తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సమావేశాలకు (PTMలు) హాజరులో 27 శాతం పెరుగుదల ఉంది. వారి పిల్లలు ఇంతకుముందులా రాణించలేకపోతున్నారని గమనించారని తెలిపింది. "ఇంటర్వ్యూ చేసిన యాభై శాతం మంది తల్లిదండ్రులు డివైజ్‌లు, నెట్‌వర్క్‌లు, డేటా ప్యాక్‌లు వంటి డిజిటల్ లెర్నింగ్ వనరులు లేకపోవడం వల్ల మహమ్మారి సమయంలో పిల్లలకు నేర్చుకునే అనుభవం సరిపోదని భావించారు" అని సర్వే తెలిపింది.
ముప్పై ఒక్క శాతం మంది తల్లిదండ్రులు మహమ్మారి సమయంలో తమ అత్యంత ఇష్టపడే విధానం ఆఫ్‌లైన్ మోడ్ లేదా క్లస్టర్ క్లాస్‌లలో ప్రత్యక్ష తరగతులు అని చెప్పారు. "ఇరవై శాతం (తల్లిదండ్రులు) వర్క్‌షీట్‌లు, ఉపాధ్యాయుల సందర్శనలు చాలా సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉన్నాయని భావించారు" అని అది పేర్కొంది. "వయస్సుకు తగిన అభ్యాస స్థాయిలను ఎదుర్కోవటానికి పిల్లలకు గణితం, ఆంగ్లంలో మరింత మద్దతు అవసరమని కనీసం 69 శాతం మంది తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు" అని సర్వే పేర్కొంది.
