కరోనా వైరస్ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. కాగా.. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. కాగా.. తాజాగా చెన్నైలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ మంత్రికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్టు వైద్య పరీక్షలలో నిర్ధారణ అయ్యింది. 

దీనితో ముఖ్యమంత్రి ఎడప్పాడి మరోమారు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆ మంత్రి జలుబు దగ్గుతో బాధపడుతూ వైద్య పరీక్ష లు చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నై సచివాలయంలో జరిగిన ప్రభుత్వ కార్యక్ర మాల్లో ఆ మంత్రి ముఖ్యమంత్రితోపాటు పాల్గొన్నారు. 

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆ మంత్రికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు వున్నట్టు పరీక్షలు నిర్వహించిన వైద్యులు సమాచారం అందించారు. దీనితో మంత్రి చెన్నైలో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నారు. ఇదిలా ఉండగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో తనతోపాటు పాల్గొన్న మంత్రికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడినట్టు తెలుసుకుని ముఖ్యమంత్రి ఎడప్పాడి దిగ్ర్భాంతి చెందారు. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రికి ఫోన్‌ చేసి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో మంత్రి ద్వారా తనకు కరోనా వైరస్‌ సోకే అవకాశముందని వైద్యనిపుణులు చెబుతుండటంతో ముఖ్యమంత్రి ఎడప్పాడి కరోనా పరీక్షలు జరుపుకోనున్నారని తెలిసింది. వారం రోజులకు ముందే ఎడప్పాడి పరీక్షలు చేసుకున్నప్పుడు ఆయనకు కరోనా సోకలేదని వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే.