Asianet News TeluguAsianet News Telugu

దేశంలో కరోనా.. ఒక్కరోజే 3,700 మంది మృతి

అదే సమయంలో రికవరీ కేసులు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో మరో 3,07,865 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ ని జయించిన వారి సంఖ్య 1.59కోట్లకు చేరింది. రికవరీ రేటు 81.77శాతంగా ఉంది.

Covid19 Daily death toll tops 3.7k for first time; Uttarakand, bengal see High Mortality
Author
hyderabad, First Published May 2, 2021, 10:30 AM IST

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విలయతాండవం చేస్తోంది. పరిస్థితి రోజు రోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. ప్రతిరోజూ వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 3,700మందికి పైగా వైరస్ తో మృత్యువాత పడ్డారు. ఇక రోజువారీ కేసులు ముందు రోజుతో పోలిస్తే.. పెరుగుతుండటం గమనార్హం. తాజాాగా దేశంలో 3.92లక్షల మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.

శనివారం ఉదయం 8గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల మధ్య దేశవ్యాప్తంగా 18లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 3,92,488 మందికి పాజిటివ్ గా తేలింది. అంతక ముందు రోజు 4లక్షల కేసులు నమోదవ్వగా..  నిన్న కాస్త తక్కువగా నమోదైనట్లే. అయితే.. పరీక్షలు తక్కువగా చేయడం వల్లే కేసులు తక్కువగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాల ద్వారా తెలుస్తోంది. ఇక తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ ల సంఖ్య 1.95కోట్లకు చేరుకుంది.

అదే సమయంలో రికవరీ కేసులు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో మరో 3,07,865 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ ని జయించిన వారి సంఖ్య 1.59కోట్లకు చేరింది. రికవరీ రేటు 81.77శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33,39,644 పాజిటివ్ కేసులు యాక్టివ్ లో ఉన్నాయి.  యాక్టివ్ కేసుల రేటు 17.13 శాతానికి పెరగడం కలవరపెడుతోంది.

గడిచిన 24గంటల్లో మరో 3,689 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 802 మంది మరణించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోనూ మరణాలు అధికంగా నమోదౌతున్నాయి. దీంతో.. ఇప్పటి వరకు 2,15,542 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.10 శాతం గా ఉంది.

ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శనివారం కాస్త నెమ్మదించినట్లు అధికారులు చెబుతున్నారు. నిన్న కేవలం 18.26లక్షల మందికి మాత్రమే టీకాలు ఇచ్చారు. వ్యాక్సిన్ల కొరత కారణంగా చాలా చోట్ల పంపిణీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మే 1 నుంచి 18ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే.. ఇప్పటి వరకు 6 రాష్ట్రాలు మాత్రమే  ఈ ప్రక్రియను ప్రారంభించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios