ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వాక్సినేషన్ డ్రైవ్ ని నేటి ఉదయం 10.30కు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. భారతదేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు వాక్సిన్లను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. సీరం ఇన్స్టిట్యూట్ లో తయారైన కోవిషీల్డ్ ఒకటైతే.... హైదరాబాద్ లోని భరత్ బయోటెక్ లో తయారైన కోవాక్సిన్. 

అయితే ఈ వాక్సిన్ పంపిణీలో కోవిషీల్డ్ తీసుకోవడానికి నేరుగా వెళ్లి తీసుకునే వీలుండగా.... కోవాగ్జిన్ తీసుకోవాలంటే మాత్రం ఒక అంగీకార పత్రంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే కోవాగ్జిన్ తీసుకోవాలంటే.... అంగీకార పత్రంపై మీరు అన్ని తెలుసుకొని ఇది రెస్ట్రిక్టెడ్ వినియోగం కోసమని, అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతి ఇచ్చారని అంగీకారం తెలుపుతున్నట్టుగా సంతకం పెట్టి అంగీకారం తెలపవలిసి ఉంటుంది. 

ఈ విధమైన అంగీకార పత్రం అంతర్జాతీయంగా కూడా కొనసాగుతూనే ఉందని చెబుతున్నప్పటికీ..... సీరం వాక్సిన్ కి అవసరం లేని అంగీకార పత్రం..కేవలం భారత్ బయోటెక్ కే ఎందుకు అవసరం అని సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఫేస్1, పేజ్ 2 ట్రయల్స్ లో వాక్సిన్ మంచి ఫలితాలనే ఇచ్చిందని, పూర్తి స్థాయిలో ఎంత మేర కొవాగ్జిన్ సమర్థత అనే విషయం ఇంకా వెల్లడవ్వాల్సి ఉందని ఈ ఫారం లో పేర్కొన్నారు. 

అంతే కాకుండా ఒకవేళ ఈ వాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆసుపత్రిలో చికిత్స అందించడంతోపాటుగా.... సీరియస్ గనుక అయితే నష్టపరిహారాన్ని కూడా భారత్ బయోటెక్ చెల్లిస్తుందని అందులో పేర్కొన్నారు. కోవాగ్జిన్ ని 6 రాష్ట్రాల్లో ఇస్తున్నారు. ఇందులో 5 ప్రతిపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రాలే...!

కోవాగ్జిన్ తమకు అక్కర్లేదు అంటూ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు మెడికల్ సూపరింటెండెంట్ కి ఒకలేఖను రాసారు. సోషల్ మీడియాలో అనేకమంది ఇలా కన్సెన్ట్ ఫారం పై సంతకం పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.