కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తూ ప్రజలందరినీ వణికిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా వాక్సిన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.  రష్యా తొలి వాక్సిన్ తాయారు చేసాము అని ప్రకటించినప్పటికీ... దాని పైన అనేక అనుమానాలు నెలకొనడంతో.. ఒక్కసారిగా నెలకొన్న ఆశలన్నీ కూడా అడియాశలయ్యాయి. 

ఇలాంటి తరుణంలో భారత ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్ధన్ ఒక తీపికబురు చెప్పారు. ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా, హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్ తో కలిసి ఐసీఎంఆర్ అభివృద్ధి చేస్తున్న కావాక్సీన్ అందుబాటులోకి వస్తుందన్నారు.  

ఈ వార్తతో ప్రజల్లో ఈ మహమ్మారిపై త్వరలోనే విజయం సాధించబోతున్నామన్న ఆనందం వ్యక్తమవుతుంది. మరోవైపు ఆక్స్ ఫోర్డ్ టీకా కోవి షీల్డ్ కూడా మూడవ దశ ట్రయల్స్ లో ఉంది. అనుకున్నవి అనుకున్నట్టుగా సాగితే.. ఈ సంవత్సరం ఆఖరకు ఆ వాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే ఆస్కారం కనబడుతుంది. 

జైడుస్‌ కాడిలా తయారు చేస్తున్న ‘జైకోవ్‌ డీ’ కూడా మంచి పురోగతిని సాధిస్తుందని, ఇది కూడా మరో నాలుగు నెల్లల్లో అందుబాటులోకి వచ్చే ఆస్కారముందని హర్షవర్ధన్ తెలిపారు. వాక్సిన్ తయారీలో భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. 

వాక్సిన్ అందించడమొక్కటే కాకుండా సరసమైన ధరలకు వాక్సిన్ ని ప్రజలకు చేరువ చేయడంలో కూడా పనిచేస్తాయని ఆయన వెల్లడించాడు. భారతదేశంలోకి వచ్చే ఏ వాక్సిన్ ని అయినా తొలుత నాకారోనా వారియర్స్ కె అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. 

భారత్ లోని కోవిడ్ వారియర్లు 50 లక్షల మంది ఉన్నారని, వీరికోసం ఇప్పటికే ఆర్డర్లు ఇవ్వడం కూడా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారతదేశం కరోనా వైరస్ వాక్సిన్ల తయారీలో సక్సెస్ అవుతుందని రష్యా పేర్కొంది.