ప్రపంచానికి భారత్ అభయం: సెప్టెంబర్ కే కరోనా వాక్సిన్ రెడీ,ఇంత తక్కువటైంలో ఎలాగంటే....
ప్రపంచానికి అభయమిస్తూ మేమున్నాము, సెప్టెంబర్ నాటికి మార్కెట్లోకి వాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని అంటుంది భారతీయ సంస్థ.
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తుంది. ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. భారతదేశం కూడా ఇందుకు అతీతం కాదు. భారత్ రెండవదఫా విధించిన లాక్ డౌన్ కూడా మే3వ తేదీనాటికి ముగుస్తుంది.
లాక్ డౌన్ ముగుస్తున్నప్పటికీ.... ఇంతవరకు మందు కానీ, వాక్సిన్ కానీ దొరక్కపోవడంతో ఇటు భారతదేశంతోపాటుగా ప్రపంచదేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఈ తరుణంలోనే ప్రపంచానికి అభయమిస్తూ మేమున్నాము, సెప్టెంబర్ నాటికి మార్కెట్లోకి వాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని అంటుంది భారతీయ సంస్థ.
పుణెలోని సీరం సంస్థ ఇప్పుడు కరోనా వైరస్ వాక్సిన్ ని తయారు చేయడంలో బిజీగా ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తో భాగస్వామ్యంలో వీరు వాక్సిన్ ని అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వైరస్ కి వాక్సిన్ రావాలంటే కనీసం మరో సంవత్సరం పడుతున్నది అంటున్న నేపథ్యంలో పుణెకు చెందిన సీరం సంస్థ మాత్రం కేవలం మరో మూడు నెలల్లో తీసుకొస్తామని అంటోంది.
దీనిపై సీరం సంస్థకు అధినేత వివరణ ఇస్తూ... తొలుత తాము కూడా సంవత్సరకాలం పడుతుందని అనుకున్నప్పటికీ... ఆక్స్ఫర్డ్ యూనివెర్సిటీ భాగస్వామ్యం వల్ల తాము ఇంత తక్కువకాలంలో తయారుచేయగలుగుతున్నామని, సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇప్పటికే తమ వాక్సిన్ ని మనుషుల మీద కూడా ప్రయోగాలను జరపడం ప్రారంభించిందని, ఆ వాక్సిన్ ట్రయల్స్ పూర్తిగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని, వారు గతంలో ఎబోలాకు కూడా వాక్సిన్ ని కనుగొన్నారని ఆయన గుర్తుచేశారు.
ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపుగా వేరే ఇతర 1000 ప్రాజెక్టులను వెనక్కి నెట్టి మరి దీన్ని ముందుకు తీసుకొచ్చినట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ వైరస్ తో పాటుగా మలేరియా కు కూడా వాక్సిన్ ని కనుగొనేందుకు తమ సంస్థ ఆక్స్ఫర్డ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ సీరం అధినేత అదర్ పూనావాలా తెలిపారు.