పవిత్ర రంజాన్ మాసంలో కొవిడ్ టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి హానీ జరగదని ప్రముఖ ఇస్లామిక్ సంస్థ పేర్కొంది. కొవిడ్ టీకా వల్ల రోజా (ఉపవాసం)పై ఎలాంటి ప్రభావం చూపదని, వ్యాక్సిన్ నేరుగా రక్తనాళాల్లో కలుస్తుందని, పొట్టలోకి వెళ్లదు కాబట్టి ఉపవాసం భంగం కాదని తెలిపింది.

ఉపవాసం చేస్తున్న కారణంగా టీకా వేయించుకోకుండా ఉండదంటూ దారుల్ ఇఫ్తా ఫరంగి మహల్ ఫత్వా జారీ చేసింది. ఒక ముస్లిం సోదరుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ఫత్వా జారీ చేశారు. 

తాను కరోనా టీకా మొదటి డోస్  తీసుకున్నానని, ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి రెండో డోస్ తీసుకోవచ్చా? అంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ రషీద్ కిడ్వాయి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ఫత్వాను జారీ చేసింది.

ఈ ఫత్వాపై ముస్లిం పెద్దలు మౌలాన్ ఖాలిద్ రషీ ఫరంగి మహలి, మౌలానా నస్రుల్లా, మౌలానా నయెముర్ రెహ్మాన్ సిద్ధిఖి, మౌలానా ముస్తాక్ తదితరుల సంతకాలు ఉన్నాయి.