కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి నేపథ్యంలో ప్రజలు అల్లాడుతున్నారు. స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకునే పరిస్థితి కూడా లేకపోయింది. ఈ మహమ్మారి కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా.. ఈ మహమ్మారి ఇంతలా వ్యాప్తి చెందడానికే గాలే కారణమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారి అత్యధికంగా గాలి ద్వారానే వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు దగ్గినపుడు, తుమ్మినపుడు, మాట్లాడినపుడు బయటికి వచ్చే తుంపర్ల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలిపింది. ఈ వివరాలతో తాజాగా క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌ను బుధవారం జారీ చేసింది. 

గత ఏడాది జూన్‌లో విడుదల చేసిన ప్రోటోకాల్‌కు ఇది పూర్తి భిన్నంగా ఉంది. గత ఏడాది జారీ చేసిన ప్రోటోకాల్‌లో, ఈ ఇన్ఫెక్షన్ సోకినవారికి సమీపంలో ఉన్నవారికి, ముఖ్యంగా శ్వాస సంబంధిత తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు, మాట్లాడినపుడు వెలువడే తుంపర్ల వల్ల ఇతరులకు వ్యాపిస్తుందని గతంలో చెప్పినప్పటికీ, గాలి ద్వారా వ్యాపిస్తుందని చెప్పలేదు. 


ఇటీవల ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కార్యాలయం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి గాలి తుంపర్ల ద్వారా జరుగుతున్నట్లు తెలిపింది. ఈ వైరస్ సోకిన గాలి తుంపర్లు గాలిలో దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూటీఓ)ను ఉటంకిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్-19 వైరస్ ప్రధానంగా సమీపంలో ఉండే వ్యక్తుల ద్వారా వ్యాపిస్తున్నట్లు, ముఖ్యంగా 1 మీటరు పరిధిలో ఉన్నవారి నుంచి వ్యాపిస్తున్నట్లు ప్రస్తుత సాక్ష్యాధారాలు చెప్తున్నాయి. 

వైరస్ ఉన్న గాలి తుంపర్లను లేదా నీటి తుంపర్లను పీల్చినవారికి లేదా అవి కళ్ళలో, ముక్కులో, లేదా, నోటిలో పడినవారికి ఈ వ్యాధి సోకుతుంది. గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఉండేవారికి కూడా ఈ వ్యాధి సోకుతుంది. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించని గదులు వంటివాటిలో ఎక్కువ మంది, చాలా సేపు ఉంటే, వారికి ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. గాలి తుంపర్లు ఒకే చోట స్థిరంగా ఉండిపోవడం, ఒక మీటరు కన్నా ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది.