Asianet News TeluguAsianet News Telugu

టీబీ బారిన కొవిడ్ రికవరీ పేషెంట్లు.. కర్ణాటకలో 25 కేసులు.. ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాట్లు

కొవిడ్-19 నుంచి రికవరీ అయినవారు క్షయవ్యాధి బారినపడుతున్న కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటకలో ఇప్పటి వరకు దాదాపు 25 కేసులు ఇలాంటివే రికార్డ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముందుజాగ్రత్తగా కొవిడ్ రికవరీ పేషెంట్లకు ప్రత్యేకంగా టీబీ స్క్రీనింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

covid recovered people contracting tb in karnataka
Author
Bengaluru, First Published Aug 19, 2021, 8:08 PM IST

బెంగళూరు: కర్ణాటకలో కొవిడ్ నుంచి పూర్తిగా రికవరీ అయ్యాక క్షయవ్యాధి(టీబీ) బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23 నుంచి 25 కేసులు పూర్తిగా కరోనా నుంచి కోలుకుని టీబీ బారిన పడ్డట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే  సుధాకర్ వెల్లడించారు. కాబట్టి ముందు జాగ్రత్తగా కొవిడ్ నుంచి రికవరీ అయినవారందరికీ టీబీ స్క్రీనింగ్ చేస్తున్నట్టు తెలిపారు. కరోనా నుంచి రికవరీ అయినవారందరూ స్వచ్ఛందంగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని గతంలో సూచించారు. కానీ, కేసులు పెరుగుతున్న తరుణంలో రికవరీ అవుతున్నవారందరికీ టీబీ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్టు తాజాగా వెల్లడించారు. కొవిడ్‌తోపాటు టీబీ కూడా ఊపిరితిత్తులపైనే ప్రభావం వేస్తుందన్న సంగతి తెలిసిందే.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. ‘రాష్ట్రంలో 28 లక్షలకు మించి కరోనా పేషెంట్లు రికవరీ అయ్యారు. కొవిడ్-19, టీబీ రెండూ ఊపిరితిత్తులపైనే ప్రభావం వేస్తాయి. కాబట్టి, జాప్యం వహించకుండా వీలైనంత తొందరగా టీబీనీ గుర్తించడానికి కొవిడ్-19 రికవరీ అయిన పేషెంట్లను పరీక్షించడానికి నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీబీ టెస్టు డ్రైవ్ చేపడుతున్నట్టు వివరించారు. ఆగస్టు 16 నుంచి 31వ తేదీల్లో ఈ డ్రైవ్ చేపట్టనున్నట్టు తెలిపారు.

2017 నుంచి 75 లక్షల అనుమానిత టీబీ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర మంత్రి వివరించారు. ఇందులో 88 శాతం కేసులకు పరీక్షలు చేశామని తెలిపారు. ఇందులో 3.9శాతం కేసుల్లో టీబీ ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు. అయితే, కరోనా మహమ్మారి విజృంభణతో టీబీ పరీక్షల కార్యక్రమం కొంత కుంటుపడిన మాట వాస్తవమేనని తెలిపారు.

2020లో టీబీ కేసులు గతేడాది కంటే 25శాతం తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రి లోక్‌సభలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, అన్ని రాష్ట్రాల్లో టీబీ పరీక్షలను పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా కారణంగా టీబీ కేసులు పెరిగినట్టు నిరూపించే ఆధారాలేవీ ఇప్పటికైతే లభించలేవని ఓ ప్రకటనలో కేంద్రం పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios