వైద్యం అందక ఆసుపత్రి గేటు వద్దే కరోనా రోగి మృతి: మంత్రిని నిలదీసిన యువతి
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలోని సదర్ ఆసుపత్రి గేటు వద్దే కరోనా చికిత్స కోసం వచ్చిన రోగి మరణించాడు. అరగంట పాటు డాక్టర్ కోసం పిలిచినా డాక్టర్లు రాకపోవడంతో తన తండ్రి మరణించినట్టుగా ఓ యువతి కన్నీరు మున్నీరుగా విలపించింది.ఈ సమయంలో అక్కడికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఆమె కడిగిపారేసింది.
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలోని సదర్ ఆసుపత్రి గేటు వద్దే కరోనా చికిత్స కోసం వచ్చిన రోగి మరణించాడు. అరగంట పాటు డాక్టర్ కోసం పిలిచినా డాక్టర్లు రాకపోవడంతో తన తండ్రి మరణించినట్టుగా ఓ యువతి కన్నీరు మున్నీరుగా విలపించింది.ఈ సమయంలో అక్కడికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఆమె కడిగిపారేసింది.
మంగళవారం నాడు సదర్ ఆసుపత్రిలో చికిత్స కోసం కరోనా రోగి పవన్ గుప్తా వచ్చాడు. సీరియస్ గా ఉన్న పవన్ గుప్తాకు చికిత్స అందించాలని ఆమె కుటుంబసభ్యులు డాక్టర్ల కోసం ఎదురు చూశారు. ఆసుపత్రిలో కన్పించినవారిని అడిగారు. అరగంటపాటు డాక్టర్ కోసం అరిచారు. కానీ ఒక్క డాక్టర్ కూడ రాలేదని బాధితులు ఆరోపించారు.
డాక్టర్లు రాకపోవడం చికిత్స అందించని కారణంగా ఆసుపత్రి గేటు వద్దే తన తండ్రి మరణించినట్టుగా పవన్ గుప్తా కూతురు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అదే ఆసుపత్రిలో తనిఖీ నిర్వహిస్తున్నారు. మంత్రి వచ్చిన విషయాన్ని తెలుసుకొన్న పవన్ గుప్తా కూతురు మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అరగంట పాటు డాక్టర్ల కోసం ఎదరు చూసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.ఇప్పుడు మీరేమో ఓట్ల కోసం వచ్చారా అని ఆమె మంత్రిని కడిగిపారేశారు.ఆసుపత్రి వద్దకు చేరుకోగానే డాక్టర్ల కోసం కనీసం వైద్య సహాయం కోసం ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లాం, కానీ తమకు ఎవరూ సహాయం చేయలేదు. దీంతో మా నాన్న చనిపోయాడని పవన్ గుప్తా కూతురు చెప్పారు.
మంత్రిని ఆమె ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా తెలిపారు. కరోనాతో చికిత్స కోసం వచ్చిన రోగికి వైద్యం అందక మరణించినట్టుగా ఓ యువతి ఏడుస్తూ చెప్పిన ఘటన తనను కలిచివేసిందన్నారు మంత్రి.మంగళవారం నాడు 2366 కరోనా కేసులు నమోదయ్యాయి. 19 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 1,41,750కి చేరుకొన్నాయి. కరోనాతో రాష్ట్రంలో 1,232 మంది మరణించారు.