కరోనా బూస్టర్ డోస్ తీసుకున్నవారు నాసల్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని   కోవిడ్ ప్యానెల్  చీఫ్  ఆరోరా తేల్చి చెప్పారు. బూస్టర్ డోస్ తీసుకోని వారే  నాసల్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 

న్యూఢిల్లీ: కరోనా బూస్టర్ డోస్ తీసుకున్నవారంతా నాసల్ వ్యాక్సిన్ ను తీసుకోవాల్సిన అవసరం లేదని కోవిడ్ ప్యానెల్ చీఫ్ ఎన్ కే ఆరోరా ప్రకటించారు. భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ ను తయారు చేసింది.ఈ వ్యాక్సిన్ కు ఇటీవలనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముక్కు ద్వారా ఈ వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు. కరోనా రాకుండా రెండు బోసులతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్నవారు నాసల్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆరోరా స్పష్టం చేశారు.బూస్టర్ డోసులు తీసుకోని వారు నాసల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని ఆయన చెప్పారు.

పదే పదే వ్యాక్సిన్ రూపంలో రోగ నిరోధక శక్తిని తీసుకొంటే ఆ వ్యక్తి శరీరం ప్రతిస్పందన తగ్గిపోయే అవకాశం ఉందని ఆరోరా అభిప్రాయపడ్డారు. తొలుత ఆరు నెలల గ్యాప్ తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనాకు సంబంధించి బూస్టర్ డోస్ తీసుకున్నవారు నాలుగవ డోస్ తీసుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి రోగ నిరోధక వ్యవస్థ బలోపేతానికి నాసల్ వ్యాక్సిన్ పనిచేయనుందని ఆరోరా చెప్పారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ముక్కు ద్వారా తీసుకొనే వ్యాక్సిన్ కు అర్హులని ఆరోరా చెప్పారు. ప్రతి ముక్కు రంధ్రంలో నాలుగు చుక్కల వ్యాక్సిన్ ను వేస్తే సరిపోతుందని డాక్టర్ ఆరోరా చెప్పారు. మొత్తం 0. 5మి.లీ. మాత్రమే వేయాల్సి ఉంటుంది. నాలుగు,ఐదు దఫాలు వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు కూడా ఇన్ ఫెక్షన్ బారిన పడ్డారని ఆయన గుర్తు చేశారు. అమెరికా, యూరప్ లలో పలువురు కరోనా బారినపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.