మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.  

మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కరణ్ జోహార్ 50వ బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఇచ్చిన పార్టీలో పాల్గొన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘నాకు COVID-19 పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నేను హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. డాక్టర్ సలహా మేరకు మందులు, చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నాను. అందరూ జాగ్రత్త వహించండి’’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. 

ఇక, దేవేంద్ర ఫడ్నవీస్ నిన్న లాతూర్ పర్యటనలో ఉన్నారు. లాతూర్ పర్యటన ముగించుకుని.. ఆయన షోలాపూర్ సందర్శించడానికి వెళ్లాల్సి ఉంది. అయితే జ్వరం రావడంతో తన పర్యటనను సగంలోనే వదిలేసి ఫడ్నవీస్ ముంబై చేరుకున్నారు. అయితే ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇక, 2020 అక్టోబర్‌లో కూడా ఫడ్నవీస్ కరోనా బారినపడ్డారు. 

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఆదిత్య ఠాక్రే ఆదివారం మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారి ఫోర్త్ వేవ్‌ను రాష్ట్రం చూడగలదని.. అయితే ప్రజలు భయపడవద్దని కోరారు. రాష్ట్రంలో కోవిడ్ -19 సంబంధిత మరణాలు పెరగడం లేదని అన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని కోరారు. తాము మాస్క్‌ ధరించడం ప్రస్తుతానికి తప్పనిసరి చేయలేదని చెప్పారు. కానీ త్వరలో దానిని అమలు చేస్తామని తెలిపారు. ప్రజుల కోవిడ్ బూస్టర్ డోస్ సకాలంలో తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఇటీవల మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించడం తప్పనిసరి కాదని.. అయితే కోవిడ్ -19 కేసులు ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇక, శనివారం మహారాష్ట్రలో కొత్తగా 1,357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 78,91,703కి చేరింది. దాదాపు 600 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 77,37,950కి చేరింది. కరోనాతో తాజాగా ఒకరు మరణించడంతో.. ఇప్పటివరకు చోటుచేసుకున్న మరణాల సంఖ్య 1,47,865 కు చేరుకుంది.