వారపు కేసుల్లో 35 శాతం పెరుగుదల... కరోనా ఫోర్త్ వేవ్ పై వైద్యనిపుణుల హెచ్చరికలు !
Covid 4th wave: భారతదేశంలో కరోనా వైరస్ వారంతపు కేసులలో 35 శాతం పెరుగుదల నమోదైంది. కొత్త వేరియంట్లు పెట్టుకువస్తున్న నేపథ్యంలో భారత్ లో మరోసారి కరోనా విజృంభణ కొనసాగే అవకాశాలు ఉన్నాయనీ, కోవిడ్-19 ఫోర్త్ వేవ్ మరింత ఆందోళనకరంగా ఉండవచ్చునని వైద్య నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Coronavirus: ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొత్త వేరియంట్లు పుట్టుకురావడం.. అవి ఇప్పటివరకు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా వ్యాపించే.. ప్రమాదకరమైన వేరియంట్లుగా అంచనాలు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వెలుగుచేసినప్పటి నుంచి చైనాకు ఎదురుకాని పరిస్థితులు అక్కడ ప్రస్తుతం నెలకొనడం రాబోయే కరోనా కొత్త వేవ్ ల ప్రమాదాన్ని సూచిస్తున్నదని నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్ లో కూడా గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన కరోనా ప్రభావం... మళ్లీ పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. వరుసగా 11 వారాల కోవిడ్-19 కేసుల ట్రెండ్ తగ్గుముఖం పట్టిన తర్వాత.. గత వారంలో ఇన్‌ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడు రోజుల్లో కొత్త కోవిడ్-19 కేసుల సంఖ్య 35 శాతం పెరిగినట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధి ప్రాంతాలు, ఢిల్లీకి ఆనుకుని ఉన్న జిల్లాలు, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో కొత్త కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
అయితే, మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంది. కానీ కొత్త వేరియంట్ కేసులు భారత్ లోనూ వెలుగు చూడటం, ఇటీవల నోయిడా, ఢిల్లీలో విద్యార్థులు అధికంగా కరోనా బారినపడం, ప్రమాదకరమైన వేరియంట్లు గా భావిస్తున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఎక్స్ఈ కేసులు భారత్ లో వెలుగులోకి రావడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏప్రిల్ 11-17తో ముగిసిన వారంలో భారతదేశంలో దాదాపు 6,610 కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో 4,900గా ఉంది. కేరళ గణాంకాలతో కలిపి గత వారంలో సుమారు 7,010 కొత్త కోవిడ్ -19 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. కేరళ ప్రస్తుత వారం నుండి కోవిడ్ డేటా విడుదలను నిలిపివేసింది. గత వారం (ఏప్రిల్ 4-10) కేరళలో 2,185 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది దేశంలో కనుగొనబడిన మొత్తం కొత్త కోవిడ్ -19 కేసులలో దాదాపు మూడవ వంతుగా ఉన్నాయి.
తగ్గిన కోవిడ్-19 మరణాలు..
దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య పెరగడం, మెరుగైన చికిత్సలు అందుబాటులోకి రావడంతో దేశంలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారంలో కేవలం 27 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది మార్చి 23-29, 2020 నుండి ఇప్పటివరకు అంటే ఈ 2 సంవత్సరాలలో అతి తక్కువ. అంతకుముందు వారంలో మొత్తం 54 మరణాలు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా 13 కేరళలో చోటుచేసుకున్నాయి.
కేసులు రెండింతలు..
మరణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుదల చూసిన మొత్తం 3 రాష్ట్రాల్లో ఒక వారంలోపు కొత్త కేసులు రెండింతలు పెరిగాయి. ఢిల్లీలో ఇప్పటివరకు అత్యధికంగా 2,307 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది గత వారం 943 కంటే 145 శాతం అధికం. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో మూడో వంతు కంటే ఎక్కువ ఢిల్లీలోనే నమోదయ్యాయి.
ఢిల్లీ వైద్యుల సూచనలు..
మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రజలు, అధికారులను వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తనిఖీ చేయడంలో సహాయపడటానికి మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలని ఢిల్లీ వైద్యులు అధికారులను కోరారు. కోవిడ్ వంటి లక్షణాలను అభివృద్ధి చేసే వ్యక్తులు తమను తాము పరీక్షించుకోవాలని మరియు వ్యాప్తిని నిరోధించడానికి తమను తాము క్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నారు. మళ్లీ కేసుల పెరుగుదల నేపథ్యంలో పరీక్షలు పెంచాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు.. అయితే, ఇప్పుడే కఠినమైన ఆంక్షలు అవసరం లేదన్నారు.
NCR పరిధిలోనూ పెరుగుతున్న కేసులు..
హర్యానాలో వారంవారీ కేసులు 1,119కి పెరిగాయి. ఇది గత వారం 514 నుండి 118% పెరిగింది. ఉత్తరప్రదేశ్ ఈ వారం 540 కేసులతో 141% పెరుగుదలను నమోదు చేసింది. అంతకుముందు వారంలో 224 కేసులు నమోదయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ, కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన కొత్త కేసులు చాలా వరకు గురుగ్రామ్, నోయిడా మరియు ఘజియాబాద్ వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న NCR నగరాల్లోనే నమోదవుతున్నాయి. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కారణంగా, దేశంలో కోవిడ్ క్రియాశీల కేసులు 12,000 కి చేరుకున్నాయి. ఇది గత వారం కంటే సుమారు 1,000 పెరుగుదలగా ఉంది.