దేశమంతా కరోనా వ్యాక్సిన్ ఉచితంగానే అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న వ్యాక్సిన్ డ్రైరన్ తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

ఢిల్లీలోనే కాదు దేశమంతా ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మరోవైపు దేశవ్యాప్తంగా నేడు టీకా డ్రైరన్ చేపట్టారు. 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ శనివారం ఉదయం ప్రారంభమైంది.

టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్ లో అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. కాగా దేశంలో టీకాను అతి త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. 

ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రా జెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల బృందం పచ్చ జెండా ఊపింది. ఈ టీకాకు షరతులతో కూడిన అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కు సిఫార్సు చేసింది.