దెయ్యాల గ్రామాల్లో వలస కార్మికులకు క్వారంటైన్.. ఉత్తరాఖండ్ వినూత్న ఆలోచన
స్వరాష్ట్రాలకు చేరుకుంటున్న వలస కార్మికులను ఆయా రాష్ట్రాలను క్వారంటైన్‌లో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది
లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీల పరిస్ధితి దారుణంగా తయారైంది. రెక్కాడితే కానీ డొక్కాడని వీరంతా ఇప్పుడు ఉపాధి లేకపోవడంతో స్వగ్రామాలకు వెళ్లక తప్పని పరిస్ధితి.
అయితే రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఏది దొరికితే దానిపై తమ స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. వీరి కష్టాలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది.
ఈ విధంగా స్వరాష్ట్రాలకు చేరుకుంటున్న వలస కార్మికులను ఆయా రాష్ట్రాలను క్వారంటైన్‌లో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. వలస కార్మికులను దెయ్యాల గ్రామాల్లో ఉంచుతోంది.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని పావురి జిల్లాలోని చాలా గ్రామాలు ఖాళీగా ఉంటాయి. ఇక్కడ కనీస సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. దీంతో అక్కడి ఇళ్లన్నీ తాళం వేసి దర్శనమిస్తాయి. అప్పటి నుంచి స్తానికులు ఈ గ్రామాలను దెయ్యాల గ్రామాలుగా పిలుస్తారు.
ప్రస్తుతం వలస కూలీలను క్వారంటైన్‌లో ఉంచేందుకు ఈ ఇళ్లను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా వలస కార్మికులను క్వారంటైన్ చేసేందుకు పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ ఆధీనంలోని భవనాలను వినియోగిస్తున్నారు.
ఇవన్నీ కూడా వూరికి నడిమధ్యలో ఉండటంతో అక్కడి ప్రజలకు వైరస్ ముప్పు పొంచి వుంటోంది. పావురి జిల్లాలో అత్యథికంగా 186 నిర్జన గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ ఖాళీగా ఉండటంతో అధికారులు సదుపాయాలు కల్పించి 576 మందిని క్వారంటైన్‌కు పంపారు.