Asianet News TeluguAsianet News Telugu

Covid 19 : మార్గదర్శకాలను రూపొందించే నాటికి థర్డ్ వేవ్ కూడా ముగుస్తుంది.. కేంద్రంపై సుప్రీం అసహనం..

’కోవిడ్  మరణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జారీ కోసం మార్గదర్శకాలను రూపొందించాలని చాలా రోజుల కిందటే ఆదేశాలు ఇచ్చాం. వాటిని ఇప్పటికే ఒకసారి పొడిగించాం. మీరు మార్గదర్శకాలను రూపొందించే నాటికి థర్డ్ వేవ్ కూడా ముగిసిపోతుంది‘

Covid 19 : SC expresses displeasure over delay in framing guidelines for issuance of death certificates
Author
Hyderabad, First Published Sep 3, 2021, 4:38 PM IST

కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.  ఆదేశాలు ఇచ్చినప్పటికీ పరిహారం మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలను రూపొందించి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు,  అవి రూపొందించే నాటికి థర్డ్  వేవ్ కూడా ముగుస్తుందేమోననే అభిప్రాయం వ్యక్తం చేసింది.
 
’కోవిడ్  మరణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జారీ కోసం మార్గదర్శకాలను రూపొందించాలని చాలా రోజుల కిందటే ఆదేశాలు ఇచ్చాం. వాటిని ఇప్పటికే ఒకసారి పొడిగించాం. మీరు మార్గదర్శకాలను రూపొందించే నాటికి థర్డ్ వేవ్ కూడా ముగిసిపోతుంది‘  అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుధ బోస్ లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.  అంతేకాకుండా  కరోనాతో మరణించిన బాధిత కుటుంబాలకు  పరిహారం అందించాలని జూన్ 30న ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

 అయితే,   ఆ గడువు సెప్టెంబర్ 8తో ముగియనున్న నేపథ్యంలో ఆ సమయంలోగా పరిహారం చెల్లింపుపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.  వీటికి సంబంధించి  సెప్టెంబర్ 11 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కోర్టు ఆదేశాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయని సుప్రీం ధర్మాసనానికి హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే,  కోవిడ్ మృతుల కుటుంబీకులకు  పరిహారం ఇచ్చేందుకు  తాజా మార్గదర్శకాలు జారీ చేయాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని  సుప్రీంకోర్టు ఆదేశించింది.  పరిహారం ఇవ్వాలని చట్టంలో విస్పష్టంగా ఉన్నందున దాన్ని అమలు చేసి  తీరాలని తేల్చిచెప్పింది.  అయితే,  తాత్కాలిక సాయం  ఎక్స్గ్రేషియా కింద  ఎంత ఇవ్వాలన్న దానిపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని,  కేంద్ర ప్రభుత్వమే  కనీస  మొత్తాన్ని  నిర్ధారించాలని సుప్రీం కోర్టు సూచించింది.

 వివిధ  అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను  ఆదేశించాలంటూ దాఖలైన రెండు వేరు వేరు పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ విధంగా తీర్పు ఇచ్చింది.

 ఇదే సమయంలో పరిహారం చెల్లించడంతో పాటు,  మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి దేశవ్యాప్తంగా ఏకీకృత విధానానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని  కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇవి ఇంకా రూపొందించుకోవడం పట్ల ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios