Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై కేంద్రం అలెర్ట్.. నేడే అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..

కరోనాకు సంబంధించిన ఏదైనా సంఘటనను ఎదుర్కోవటానికి, సంసిద్ధతను నిర్ధారించడానికి రాజధాని ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆసుపత్రులలో నేడు(మంగళవారం) మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది. 

Covid 19 Mock Drill Will Be Held In Many States From Today
Author
First Published Dec 27, 2022, 5:13 AM IST

చైనా సహా పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పనిలో పడింది. ఒక వేళ కేసులు ఉధృతమైతే.. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్రం సలహాను అనుసరించి.. రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆసుపత్రులలో నేడు (మంగళవారం) మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి.  

ఈ మాక్ డ్రిల్‌లో ఆరోగ్య సౌకర్యాల లభ్యత, ఐసోలేషన్ బెడ్‌ల సామర్థ్యం, ​​ఆక్సిజన్‌తో కూడిన పడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్‌తో కూడిన పడకలు, వైద్యులు, నర్సులు, పారామెడిక్స్, ఆయుష్ వైద్యుల వాంఛనీయ లభ్యత వంటి ఇతర వనరులపై దృష్టి పెట్టాలని సూచించింది. ఆశా, అంగన్‌వాడీ వర్కర్లతో సహా ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లను కూడా ఈ మాక్ డ్రిల్‌లో భాగం చెయ్యాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. 

భారత్ లో కరోనా పరిస్థితి

మనదేశంలో కొత్తగా 196 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, దీంతో కేసుల సంఖ్య 3,428కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారికి ఇప్పటికే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పని సరి చేసింది. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కోవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.మరోవైపు.. తీర్థయాత్ర కోసం రాష్ట్రానికి వచ్చిన ఐదుగురు విదేశీ పౌరులకు కోవిడ్ -19 సోకినట్లు బీహార్ అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు థాయ్‌లాండ్‌కు చెందినవారు కాగా, ఒకరు మయన్మార్‌కు చెందినవారు. ఎయిర్‌పోర్టు, గయా రైల్వేస్టేషన్‌లో తనిఖీలు పెంచామని తెలిపారు.

వారం చివరిలో మొత్తం 33 మంది విదేశీయులకు పరీక్షలు నిర్వహించామని, వారిలో నలుగురు మహిళలు, ఒక వ్యక్తి కరోనా సోకిందని కేంద్ర తెలిపింది.  35 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వారికి చిక్సిత అందిస్తూ.. ఐసోలేషన్ లో ఉంచారు. ఇటీవల చైనా నుండి తిరిగి వచ్చిన యూపీ వ్యక్తికి  కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి బ్రజేష్ పాఠక్ ..  విదేశీ ప్రయాణాల నుండి తిరిగి వచ్చిన వారు కోవిడ్ -19 పరీక్షలు చేయించుకునే వరకు ఇంట్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికైనా టెస్టు రిపోర్టు పాజిటివ్‌గా వస్తే వెంటనే అడ్మినిస్ట్రేషన్‌కి తెలియజేయాలని, అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.

104 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన ఢిల్లీ ప్రభుత్వం 

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధతలో భాగంగా జనరిక్ ఔషధాలను కొనుగోలు చేసేందుకు ఆసుపత్రులకు రూ.104 కోట్ల బడ్జెట్‌ను ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించింది. సమీక్షా సమావేశంలో..  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతులను సాయంత్రంలోగా ఆరోగ్య శాఖతో పడకలు, వెంటిలేటర్లు, ఐసియులు, మానవ వనరులు, ఆక్సిజన్ ప్లాంట్లు మరియు వైద్య పరికరాల వివరాలను పంచుకోవాలని ఆదేశించారు.  

COVID-19 కేసులలో ఏదైనా పెరుగుదలను ఎదుర్కోవటానికి పడకలు , సిబ్బంది లభ్యతతో సహా వాటి సంసిద్ధతను అంచనా వేయడానికి ఢిల్లీ అంతటా ఉన్న ఆసుపత్రులు డిసెంబర్ 27 న మాక్ డ్రిల్ నిర్వహిస్తాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం తెలిపారు. కొన్ని దేశాల్లో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సోమవారం ఈ మేరకు ఒక సలహాను జారీ చేసింది.

ఈ డ్రిల్ ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్‌ఎన్‌జెపి హాస్పిటల్ , దేశ రాజధానిలోని ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతుంది. కేంద్రం సూచనలను అనుసరించి, కోవిడ్ నిర్వహణ కోసం వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి మంగళవారం అన్ని ఆసుపత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు సిసోడియా చెప్పారు. ఎక్కడైనా గ్యాప్‌ వస్తే వెంటనే వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. మంగళవారం నుంచి ఢిల్లీ ప్రభుత్వ పోర్టల్‌లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల లభ్యతపై రియల్ టైమ్ డేటా ప్రజలకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

ఎల్ఎన్జేపీ(LNJP)మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. మేము ఈ మాక్ డ్రిల్ కు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం, ఇది COVID-19కి సంబంధించిన ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి మా సంసిద్ధతను అంచనా వేస్తుంది. కోవిడ్-19 పరీక్షలు కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరంలో రోజుకు 2,500 నుంచి 3,000 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios