కోవిడ్ -19 ఇంకా ఎక్కడికీ పోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అది తన రూపాలను మార్చుకొని మళ్లీ తెరపైకి వస్తోందని చెప్పారు. ఈ మహమ్మారి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

కరోనా వైరస్ మహమ్మారి ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కోరారు. క‌రోనా వైర‌స్ ఇంకా పూర్తి స్థాయిలో వెళ్లిపోలేద‌ని చెప్పారు. అది త‌న రూపాల‌ను మారుస్తోంద‌ని అన్నారు. తిరిగి పుంజుకుంటోంద‌ని తెలిపారు. గుజరాత్‌లోని జునాగఢ్‌లోని ఉమియా మాతా ఆలయ 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వర్చువల్ గా ప్రసంగించారు. భార‌త్ లో వ్యాక్సినేష‌న్ డ్రైవ్ వేగాన్ని ఆయ‌న మెచ్చుకున్నారు. 

“ కరోనా (మహమ్మారి) ఒక పెద్ద సంక్షోభం. అయితే సంక్షోభం ముగిసిందని మేము చెప్పడం లేదు. ఇది కొంత విరామం తీసుకోవచ్చు, కానీ అది ఎప్పుడు పుంజుకుంటుందో మాకు తెలియదు” అని ప్రధాని మోదీ అన్నారు. “ ఇది ‘బహురూపియ’ (ఎప్పటికీ పరిణామం చెందే) వ్యాధి. దీన్ని అరికట్టేందుకు దాదాపు మ‌నం 185 కోట్ల డోస్‌లు ఉప‌యోగించ‌డం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా ప్ర‌జ‌ల స‌హ‌కారం వ‌ల్లనే సాధ్య‌మైంది.” అని అన్నారు. 

ఉమియా మాతా భక్తులు సహజ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ప్ర‌ధ‌ని న‌రేంద్ర మోడీ కోరారు. “ రైతులు సహజ వ్యవసాయాన్ని అవలంబించాలి. మాతృభూమిని రక్షించాలి. లేక‌పోతే ఎదో ఒక రోజు వ్యవసాయం చేయ‌డానికి భూమి అనుకూలంగా ఉండ‌దు. ఇది వ్య‌వ‌సాయ‌ ఉత్పత్తులను ఇవ్వడం ఆపివేస్తుంది” అని ప్రధాని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్‌లోని ప్రతీ జిల్లాలో 75 సరస్సులను నిర్మించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

ఈ ఉమియా మా దేవత గౌరవార్థం నిర్మించిన ఉమియా మాతా ఆలయాన్ని 2008 సంవ‌త్స‌రంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ తొలిసారిగా ప్రారంభించారు. కాగా అంత‌కు ముందు ‘ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ , ఇతర వ్యవసాయ సంబంధిత పథకాలల్లో భాగంగా 11.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 1.82 లక్షల కోట్లు బదిలీ చేసినట్లు ప్రధాని ప్రకటించారు. ఈ మేరకు ఆయ‌న ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యూకే, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. చైనాలో అయితే క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ఠిన‌మైన లాక్ డౌన్ ను విధించారు. కాగా ఈ క‌రోనా వైర‌స్ లో మ‌రో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. ఇదే ఇప్పుడు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇది ఒమిక్రాన్ కంటే ప‌ది రేట్లు వేగంగా వ్యాపిస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

యూకేలో మొద‌ట వెలుగులోకి వ‌చ్చిన ఈ XE వేరియంట్ తాజాగా భార‌త్ లోకి ప్ర‌వేశించింది. గుజరాత్‌లో ఈ వేరియంట్ కేసు న‌మోదు అయ్యింది. మార్చి 13వ తేదీన ఓ వ్యక్తి కరోనా సోకింది. వారం రోజుల్లో ఆయ‌న కోలుకున్నాడు. అయితే ఆ వ్యక్తి నమునాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా అతడికి కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ సోనికట్టుగా నిర్దారణ అయ్యింది. ఈ కొత్త వేరియంట్ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.