పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే వైపుగా కేంద్రం దృష్టి సారిస్తోంది. దీని ద్వారా కరోనాకు మరింత సమర్థవంతంగా చెక్ పెట్టొచ్చని భావిస్తోంది.
ఢిల్లీ : వ్యాక్సినేషన్ తో Covid-19కు మరింత చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ మెజారిటీగా పూర్తి చేయగా తాజాగా booster dose మీద దృష్టి సారించింది. 18యేళ్లు పై బడిన భారత పౌరులందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 యేళ్లు పైబడిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ అందుబాటులో ఉంది. రెండో డోస్ తీసుకున్నాక 9 నెలలు లేదా 39 వారాల తరువాత బూస్టర్ డోస్ కు కేంద్రం అనుమతి ఇస్తుంది. ఫోర్త వేవ్ వచ్చే అవకాశం ఉండడంతో బూస్టర్ డోస్ లపై దృష్టి సారించింది. ఇప్పటివరకు 181 కోట్ల 24 లక్షల 97వేల 303 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగా త్వరలోనే బూస్టర్ డోసుల పంపిణీ స్టార్ట్ చేయనున్నారు.
ఇదిలా ఉండగా, కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు మోతాదుల మధ్య అంతరాన్ని 12-16 వారాల నుంచి 8-16 వారాలకు తగ్గించాలని ఇమ్యునైజేసణ్ పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని అధికారులు తెలిపారు.
నిరుడు మే 13వ తేదీన యునైటెడ్ కింగ్ డమ్ నుంచి వచ్చిన రియల్ లైఫ్ ఎవిడెన్స్ ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్రం 12-16 వారాలకు పెంచింది. అంతకు ముందు కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి 6-8 వారాలుగా ఉండేది. ప్రస్తుతం పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలో 60యేళ్లు పై బడిన వృద్ధులకు, ఆరోగ్య సంరక్షణ అధికారులు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి బూస్టర్ డోసులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కవ మంది లభ్దిదారులకు ఈ డోసు చేరాలనే ఉద్దేశ్యంతో కోవిడ్ 19 వర్కింగ్ గ్రూప్ ఈ వ్యవధి తగ్గించాలని సిఫార్సు చేసింది.
గతంలో నిర్దేశించిన విధంగా మొదటి రెండు డోసుల మద్య లాంగ్ గ్యాప్ కారణంగా ఇప్పటిదాకా 2.17 కోట్ల మంది లబ్దిదారులకు మాత్రమే ముందు జాగ్రత్తగా మూడో డోసును అందించారు. కాగా కోవీషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ ని 8.-16 వారాలకు తగ్గించడం వల్ల తొందరగా ఎక్కువ మందికి ఈ డోసును అందజేయచ్చు.
ఇదిలా ఉండగా.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జనాభా కు కూడా మూడో డోసు ఇచ్చే విషయంలో శాస్త్రీయ ఆధారాలపై NTAGI ప్రస్తుతం చర్చిస్తోంది. త్వరలోనే ఈ నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. కాగా గత వారం నుంచి ఆసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో కేసుల పెరుగదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ -19 కట్టడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది.
