ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కు  కోర్టు  సమన్లు పంపింది.  రెండు చోట్ల ఓటరు ఐడీలు కలిగి ఉన్నారనే ఫిర్యాదు మేరకు సమన్లు పంపింది కోర్టు.

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ కు మంగళవారంనాడు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. రెండు ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారని ఆమెపై అందిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.సునీతా కేజ్రీవాల్ కు రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటరు జాబితాలో ఓటు హక్కు నమోదు చేసినట్టుగా ఫిర్యాదు అందింది. ఢిల్లీలోని చాందిని చౌక్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాహిబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీతా కేజ్రీవాల్ కు ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు అందింది.

తీస్ హజారి కోర్టులకు చెందినమెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అర్జిందర్ కౌర్ ఈ మేరకు సమన్లు పంపారు. 1950 ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారంగా శిక్షార్హమైన నేరాలకు పాల్పడినందున సమన్లు పంపినట్టుగా తెలిపారు.ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్నట్టుగా కోర్టు తెలిపింది. ఫిర్యాదుదారుడు ఎలక్టోరల్ రోల్ రెండు ధృవీకరించిన కాపీలను కూడ సాక్ష్యంగ సమర్పించిన విషయాన్ని సమన్లలో కోర్టు పేర్కొంది.

ఈ విషయమై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.బీజేపీ ఢిల్లీ రాష్ట్ర శాఖ హరీష్ ఖురానా ఈ విషయమై కోర్టులో ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం మేరకు ఒక వ్యక్తి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఓటు హక్కుండాలి. రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే నేరం.