బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్  (Tejaswi Yadav) కు మరో చిక్కు బిగుసుకుంది. గుజరాతీలపై చేసిన ఆరోపణలకు సంబంధించి అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు సోమవారంనాడు సమన్లు జారీ చేసింది. 

గుజరాత్‌లో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejaswi Yadav)కు కష్టాలు పెరిగాయి. గుజరాతీలు దుండగులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వి యాదవ్ పై పరువు నష్టం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు అతడికి సమన్లు ​​జారీ చేసింది. పరువు నష్టం దావా వేసిన ఫిర్యాదు సరైనదేనని భావించిన మెట్రోపాలిటన్ కోర్టు తేజస్వి యాదవ్‌ (Tejaswi Yadav) ను సెప్టెంబర్ 22న హాజరుకావాలని కోరింది. 

తేజస్వి యాదవ్‌పై అహ్మదాబాద్ వ్యాపారి, సామాజిక కార్యకర్త హరేష్ మెహతా పరువు నష్టం కేసు వేశారు. పరువు నష్టం ఆరోపణలను రుజువు చేసేందుకు ఫిర్యాదుదారు తరఫున వాంగ్మూలాల సీడీలు, 15 మంది సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. వ్యాపారి హరేష్ మెహతా చేసిన ఫిర్యాదు మేరకు తేజస్విపై ఐపీసీలోని 499, 500 సెక్షన్ల కింద క్రిమినల్ పరువునష్టం కేసు నమోదైంది. మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి DJ పర్మార్ పరువు నష్టం కేసు ఫిర్యాదును చెల్లుబాటులో ఉంచుతూ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌కు సమన్లు ​​జారీ చేశారు. 

తేజస్వి ఏమన్నారు?

అసెంబ్లీ ప్రాంగణంలో మెహుల్ చోక్సీపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని నేటి పరిస్థితుల్లో గుజరాతీలు మాత్రమే గూండాలు కాగలరని అన్నారు. మోసం చేసినా వాళ్లు కూడా క్షమించబడుతున్నాడు. వాళ్లే ఎల్ఐసీ, బ్యాంకుల డబ్బులు తీసుకుని పారిపోతే.. అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు?' అని తేజస్వి వ్యాఖ్యానించారు. ఈ సంచలన ప్రకటన ఆధారంగా అహ్మదాబాద్ వ్యాపారవేత్త హరేష్ మెహతా మార్చి 21 న తేజస్వి యాదవ్‌పై పరువు నష్టం కేసు పెట్టారు. అప్పటి నుంచి మెట్రోపాలిటన్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

గత విచారణలో తేజస్వి యాదవ్‌ (Tejaswi Yadav)కు సమన్లు ​​పంపాలని ఫిర్యాదుదారు హరేష్ మెహతా తరపున డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పరిశీలనను ప్రస్తావిస్తూ.. హరేష్ మెహతా తరపు న్యాయవాది ప్రఫుల్ ఆర్ పటేల్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించడాన్ని తేలికగా తీసుకోవద్దని కోర్టులో అన్నారు. నిందితుడు ఎవరైనప్పటికీ అతనిపై తగిన చర్యలు తీసుకోవాలి.కొద్ది మంది వ్యక్తుల ఆధారంగా ఒక సమాజంలోని లేదా రాష్ట్రంలోని ప్రజలందరినీ తేజస్వి దుండగులు అని పిలవలేరని పటేల్ అన్నారు. ఇది ఇలాగే కొనసాగి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రాల మధ్య విభేదాలు కూడా పెరుగుతాయి. ఇది సమాఖ్య నిర్మాణానికి విరుద్ధం, దేశ ఐక్యతను బలహీనపరుస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది.