దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును తప్పదొవ పట్టించేలా వ్యవహరించిన అత్యాచార బాధితురాలిపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో  ఈ ఉన్నావ్ అత్యాచార ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది. 

ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటనలో భాదితురాలు మైనర్ అంటూ కోర్టుకు సమర్పించిన దృవపత్రాలు నకిలీవంటూ ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న శుభమ్ అనే  నిందితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బాధితురాలు సమర్పించిన దృవపత్రాలు నిజంగానే నకిలీవని తేల్చింది. దీంతో భాదితురాలితో పాటు ఇందుకు సహకరించిన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. 

ఉత్తర ప్రదేశ్ లో ఉన్నావ్ అత్యాచార కేసు సంచలమే కాదు రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించింది. ఈ అత్యాచార కేసులో అధికార బిజెపి పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధాన నిందితుడిగా వుండటమే ఇందుకు కారణం. ఆయనతో పాటు మరికొంత మంది కూడా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలున్నారు. వారందరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 

ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న శుభమ్ అనే నిందితుడి తండ్రి హర్పాల్ సింగ్ భాదిత యువతి మైనర్ కాదంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మైనర్ అంటూ బాధిత యువతి సమర్పించిన టిసి( ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్) నకిలీదంటూ అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విచారణ సందర్భంగా ఇది నిజమని కోర్టు తేల్చడంతో బాధితురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులపై ఫోర్జరీ, మోసం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.