PM Modi degree: ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ కోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ పై గుజరాత్ యూనివర్సిటీ అహ్మదాబాద్ కోర్టులో పరువునష్టం దావా వేసింది.
PM Modi degree: ఇప్పటికే ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో సతమతమవుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మరో వివాదం ఇరుక్కున్నాడు. కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్‌లకు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి. వాస్తవానికి ప్రధాని మోదీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లు గుజరాత్ యూనివర్శిటీపై అవమానకర ప్రకటనలు చేశారని యూనివర్సిటీ తన ఫిర్యాదులో పేర్కొంది.
మే 23న సమన్లు
అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జయేష్‌భాయ్ చౌవాటియా కోర్టు శనివారం మే 23న ఇద్దరు ఆప్ నేతలకు సమన్లు జారీ చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 (పరువు నష్టం) కింద గుజరాత్ యూనివర్సిటీ చేసిన ఫిర్యాదు ఆధారంగా వారిపై కేసు నమోదైనట్టు న్యాయమూర్తి తెలిపారు. ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని గుజరాత్ యూనివర్సిటీ (జీయూ)ని కోరుతూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సంజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదుదారు ప్రకారం.. ఇద్దరు నేతలూ ప్రధాని మోడీ డిగ్రీపై విశ్వవిద్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని విలేకరుల సమావేశాలు, ట్విట్టర్ హ్యాండిల్స్‌లో అవమానకరమైన ప్రకటనలు చేశారు.
యూనివర్సిటీ ప్రతిష్టకు దెబ్బ
గుజరాత్ యూనివర్శిటీని టార్గెట్ చేస్తూ ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని, సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదుదారు తరపు న్యాయవాది అమిత్ నాయర్ అన్నారు. అడ్వకేట్ అమిత్ ఇంకా మాట్లాడుతూ.. గుజరాత్ విశ్వవిద్యాలయం 70 సంవత్సరాల క్రితం స్థాపించబడిందనీ, ఈ యూనివర్శిటీకి ప్రజల్లో పలుకుబడి ఉందని, నిందితుల ప్రకటనలతో యూనివర్సిటీపై అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
