తక్కువ ధరలో మంచి ఆఫర్లు వస్తున్నాయని సంబరపడిన ఆ దంపతులు రూ.21 లక్షలు పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాడు అడిగిన అన్ని వివరాలు అన్నీ ఇచ్చేసి ఘరానా మోసానికి గురయ్యారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎంతో మంది వాటి బారిన పడుతున్నారు. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని, ఏటీఎం కార్డు నెంబర్, మరి కొన్ని వివరాలు చెప్పాలని కోరగానే, వారు అడిగిన వివరాలన్నింటినీ అందించడం, తరువాత మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించడం తరచూ జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలకు నిరక్ష్యరాసులే బలైపోతున్నారంటే పొరపాటే. బాగా చదువుకున్న వ్యక్తులు, ఐటీ కంపెనీల్లో పని చేసే వ్యక్తులు కూడా ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు.
మారుతున్న కాలనికి తగ్గట్టు సైబర్ నేరగాళ్లు కూడా అప్ డేట్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో కాల్ చేసి బ్యాంకు వివరాలు అడగకుండా... వాట్సాప్ ల ద్వారా కొన్ని ప్రమాదకరమైన లింకులు పంపించి వాటి ద్వారా బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి తరహా ఘటనే ముంబైలోని ఓ జంటకు ఎదురైంది. వారి క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాడు ఏకంగా రూ.21 లక్షలను కొల్లగొట్టాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ సైబర్ మోసగాడు అంధేరి ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్తను సంప్రదించాడు. తనను తాను క్రెడిట్ కార్డ్ కంపెనీకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. కేవలం రూ.1 చెల్లించి ట్రావెల్ ప్యాకేజీలు, ఇతర ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించాడు. దీంతో అతడు సంతోషించాడు. ఆ నేరగాడితో తన వ్యక్తిగత వివరాలు కూడా అందించాడు. ఆ వ్యాపారవేత్త క్రెడిట్ కార్డు నుంచి ఒక్క రూపాయిని ట్రాన్స్‌ఫర్ చేశాడు. అతడిని పూర్తిగా నమ్మిన వ్యాపారవేత్త తన భార్య క్రెడిట్ కార్డకు సంబంధించిన వివరాలను కూడా అందజేశాడు.
కొంత సమయం తరువాత రూ. 14.1 లక్షల క్రెడిట్ కార్డ్ లావాదేవీలు జరిగినట్టు ఆ వ్యాపారవేత్త భార్యకు మెసెజ్ అలెర్టులు వచ్చాయి. దీంతో ఆ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. భర్త తన క్రెడిట్ కార్డు లావాదేవీలు చూసుకున్నాడు. తన కార్డు నుంచి కూడా మోసగాడు రూ.7 లక్షలు షాపింగ్ చేశాడని గ్రహించాడు. వెంటనే పోలీసులను సంప్రదించాడు.
‘‘ కార్డ్ ప్రాసెసింగ్‌ను పూర్తి చేయడానికి లింక్‌ను క్లిక్ చేయాలని అతడు నాకు సూచించాడు. దీంతో పాటు నా దగ్గర ఇప్పటికే ఉన్న కార్డ్ వివరాలు, అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు కాపీలను అతడు కోరినట్టు వాట్సాప్ ద్వారా పంపించాను. ఆ లింక్ లో వివరాలు నింపిన తరువాత అతడు నా క్రెడిట్ కార్డు నుంచి ఒక్క రూపాయిని బదిలీ చేయాలని కోరాడు. నేను నా భార్య పేరు మీద కూడా మరో ఫారమ్ ను నింపి ఒక్క రూపాయిని బదిలీ చేశాను. నా భార్య కార్డు వివరాలను కూడా అందజేశాను ’’ అని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ మోసం విషయంలో మహారాష్ట్ర సైబర్ సెల్ PRO సంజయ్ షింత్రే మీడియాతో మాట్లాడారు. ఆఫర్లకు ఆకర్షితులయ్యే ముందు కొంచెం ఆలోచించాలని సూచించారు. అసలైన కంపెనీతో మాట్లాడాలని, అలాంటి కంపెనీ ఉందా లేదా అని కనుక్కోవాలని తెలిపారు. ఎవరైనా లింకులు పంపితే దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆ లింక్ లో ‘S’ అనే అక్షరం ఉందా లేదా అనే విషయం గమనించాలని తెలిపారు. HTTPS:// వెబ్ లింక్‌లో ‘S’ అంటే ‘సెక్యూర్’ అని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ‘S’ లేకపోతే లేకపోతే (HTTPS అంటే - హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ ) ఆ లింక్ ను క్లిక్ చేయకపోవడమే ఉత్తమం అని తెలిపారు.
