ఛత్తీస్‌గఢ్‌లో భార్యాభర్తలు ఒకటి, రెండు స్థానాలు సాధించి అన్యోన్యతకు చిరునామాగా మారారు. వివరాల్లోకి వెళితే.. బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్‌సింగ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎంపికవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని ఎంతో శ్రమించారు.

ఇందు కోసం చదువు పూర్తవ్వగానే ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవ్వడం మొదలుపెట్టారు. పెళ్లయ్యినప్పటికీ.. తన లక్ష్యాన్ని పక్కనబెట్టకుండా, భార్య విభాసింగ్‌ సహకారంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.

ఆమె సైతం భర్తకు సహకరిస్తూనే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పరీక్షలు రాస్తూ వస్తున్నారు. ఇటీవల చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ పరీక్ష వీరిద్దరూ హాజరయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో అనుభవ్ సింగ్ ప్రథమ, విభా సింగ్ రెండో స్థానంలో నిలిచారు.

అనుభవ్‌కు 298.3744 మార్కులు రాగా.. విభా సింగ్‌కు 283.9151 మార్కులు వచ్చాయి. దీనిపై వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. ఒకరికొకరం సాయం చేసుకున్నాం...విజయం సాధించామని, కుటుంబసభ్యులు కూడా తమకు ఎంతో అండగా నిలిచారని వారు తెలిపారు.