ఓ యువకుడి వేధింపులు ఓ జంట ప్రాణాలను తీశాయి. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా హొసదుర్గం తాలుకా కొండాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో అతని భార్యను అదే గ్రామానికి చెందిన వినయ్ అనే యువకుడు ఫోన్‌లోవేధించడమే కాకుండా.. ఆయా సంభాషణలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీనిని గుర్తించిన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో కేసును విత్ డ్రా చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని యువకుడు బెదిరించాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన బాధిత దంపతులు యువకుడి వేధింపులను ఆడియో చేసి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు.

అనంతరం తోణచేనహళ్లి శివారులోని వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఆడియో క్లిప్పింగ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం గ్రామస్తును విచారించారు. అనంతరం దంపతుల ఇంటికి వెళ్లి చూడగా అక్కడ ఎవరు లేరు. వీరి కోసం వెతుకుతుండగా గ్రామ పొలిమేరల్లో చెట్టుకు వేలాడుతూ కనిపించారు.

వెంటనే వారిని కిందకు దించగా.. భర్త అప్పటికే మరణించాడు. కొన ఊపిరితో ఉన్న భార్యను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వినయ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.