నిషేధిత ప్రాంతంతో వాహనాలు నడుపుతూ మరో టూరిస్టు పట్టబడ్డాడు. నుబ్రా వ్యాలీలోని హుండర్‌లో ఇసుక తిన్నెలపై టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని నడుపుతున్నట్లుగా కనిపిస్తున్న..రెండు ఫోటోలను లేహ్ పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

న్యూఢిల్లీ : లడక్ లోని నిషేధిత ప్రాంతాల్లో పర్యాటకులు ఎస్‌యూవీ వాహనాన్ని నడుపుతున్న ఫొటోలు దొరికాయి. ఇలాంటి చర్యలు సుందరమైన లడఖ్‌ను నాశనం చేస్తాయని లేహ్ పోలీసులు అంటున్నారు. ఈమేరకు లెహ్ పోలీసులు ఫేస్‌బుక్‌లో రెండు ఫోటోలను పోస్ట్ చేసారు, టయోటా ఫార్చ్యూనర్ SUVని నుబ్రా వ్యాలీలోని హుండర్‌లో ఇసుక తిన్నెలపై నడుపుతున్నట్లుగా ఈ ఫొటోల్లో కనిపిస్తుంది. ఈ ఎడారి ప్రాంతం సాహస ప్రియులకు ప్రసిద్ధి చెందింది. చల్లని ఎడారి ప్రకృతి దృశ్యానికి ప్రసిద్ధి చెందింది.

"హుండర్‌లోని ఇసుక తిన్నెలపై కార్లను నడపకూడదని ఎస్‌డిఎమ్ [సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్] నుబ్రా ఆదేశాలను ఒక పర్యాటక వాహనం ఉల్లంఘించింది. ఈ వాహనం జైపూర్‌కు చెందిన దంపతులది. దీంతో వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. వీరిమీద కేసు బుక్ చేశారు. అంతేకాదు వీరినుంచి రూ. 50,000 బాండ్ తీసుకున్నాం’ అని లేహ్ పోలీసులు ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

"ఇలాంటి చర్యల వల్ల సహజ ప్రకృతి దృశ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, నిషేధాజ్ఞలను ఉల్లంఘించనట్లవుతుంది కాబట్టి ఇసుక దిబ్బలపై డ్రైవ్ చేయవద్దని జిల్లా పోలీసులు లేహ్ పర్యాటకులను అభ్యర్థిస్తున్నారని" అని పోలీసులు తెలిపారు.

SUV వాహనం లైసెన్స్ ప్లేట్ మీదున్న నెంబర్ ప్రకారం.. ఇది ఢిల్లీ-రిజిస్టర్డ్ వాహనం అని తెలుస్తోంది. ఇలా ప్రకృతి దృశ్యాల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపని పర్యాటకులపై లెహ్ పోలీసులు జరిమానా విధించినందుకు పలువురు ప్రశంసించారు. "మంచి పని" అని ఫేస్‌బుక్ యూజర్స్ కొనియాడుతున్నారు. "హ్యాట్సాఫ్, లడఖ్ పోలీస్" అని మరొకరు వ్యాఖ్యానించారు.

నుబ్రా వ్యాలీ లేహ్‌కు ఉత్తరం వైపు కొన్ని గంటల దూరంలో ఉంది; ఇక్కడే ష్యోక్, సియాచాన్ నదులు కలుస్తాయి. ఈ లోయ లడఖ్‌ను కారకోరం శ్రేణులు, సియాచిన్ హిమానీనదం నుండి వేరు చేస్తుంది. ఏప్రిల్‌లో, ఇద్దరు పర్యాటకులు వాహనంలో సన్‌రూఫ్‌లోంచి బైటికి చూస్తూ కేకలు వేస్తూ, పాంగోంగ్ సరస్సు గుండా ఆడి SUV రేసింగ్‌ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో మీద విస్తృతంగా విమర్శలు వచ్చాయి. ఆడి SUVకి హర్యానా లైసెన్స్ ప్లేట్ ఉంది. అంతేకాదు ఈ వీడియోలో ఫోల్డబుల్ కుర్చీలు, మద్యం సీసాలు, నీరు, చిప్స్ ప్యాకెట్లతో కూడిన టేబుల్ కూడా కనిపించింది.