దేశవ్యాప్తంగా ఈ ఏడాది చలిగాలుల తీవ్రత పెరిగింది.. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో జనం బయటకి వెళ్లాలంటనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో చలి నుంచి కాపాడుకునేందుకు కొత్తగా ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

మొన్న ఢిల్లీకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ చలి నుంచి రక్షించుకోవడానికి కారులో నిప్పుల కుంపటి వెలిగించి డోర్ లాక్ చేసుకుని పడుకున్నాడు. ఊపిరి ఆడకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా పంజాబ్‌లో దంపతులు చలి కాచుకునేందుకు బెడ్‌రూమ్‌లో చలిమంట వేసుకుని పడుకున్నారు.

పొగ గది మొత్తం కమ్మేయడంతో వారు ఊపిరాడక మరణించారు. వివరాల్లోకి వెళితే.. జలంధర్ అవతార్‌నగర్‌కు చెందిన మార్బుల్ వ్యాపారి రణజీత్ కుమార్, అతని భార్య రీటాలు గడ్డకట్టే చలి నుంచి కాపాడుకునేందుకు తమ బెడ్‌రూమ్‌లో చిన్నపాటి చలి మంట వేసుకుని పడుకున్నారు.

ఉదయం పాలవాడు రావడంతో రీటా స్పందించలేదు. దీంతో పక్కగదిలో ఉంటున్న రణజీత్ సోదరుడు, అతని భార్య కలిసి తలుపులు బద్దలు కొట్టి చూడగా వారిద్దరూ చలనం లేని స్థితిలో కనిపించారు. దీంతో దంపతులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దంపతుల మృతితో ఆ ప్రాంతంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.