డిజిటల్ ఇండియాకు మద్ధతుగా ఓ నూతన వధూవరులు వినూత్నంగా ఆలోచించారు. తమ వివాహ విందు మెనూను వెరైటీగా రూపొందించారు. ఇది చూసి అతిధులు ఆశ్చర్యపోతే నెటిజన్లు అవాక్కయ్యారు. ఇంతకీ వాళ్లు చేసిన అంత వింతపని ఏంటంటే... తమ వివాహ విందు మెనూను ఆధార్ కార్డ్ రూపంలో తయారు చేసి అతిథులను షాక్ కు గురి చేశారు. 

పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెళ్లి ఆధార్‌ కార్డు మెను వైరల్ గా మారింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వరుడు గోగోల్‌ షాహా, వధువు సుబర్ణ దాస్‌ల పెళ్లి ఫిబ్రవరి 1న జరిగింది. 

ఇది విశేషం కాదు వీరి పెళ్లికి వచ్చిన అతిథుల కోసం వీరు విందు టేబుల్ మీద అచ్చం ఆధార్ కార్డును పోలిన మెనూను పెట్టారు. దీనికోసం వీరు కాస్త భిన్నంగా ఆలోచించారు. దీనిపై నూతన వరుడు గోగోల్‌ స్పందిస్తూ.. ‘ఇది నా భార్య సుబర్ణ దాస్‌ ఆలోచన..’ అని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు డిజిటల్‌ ఇండియాకు మేము మద్దతుగా నిలవాలనుకున్నాం. అయితే మాకు ఇంతకంటే మంచి ఆలోచన కనిపించలేదు. అందుకే మా వెడ్డింగ్ మెను‌ కార్డును ఆధార్ కార్డులా తయారు చేయించి డిజిటల్‌ ఇండియాకు మద్ధతునిచ్చాం.. అని సంతోషంగా చెప్పుకొచ్చాడు.  

విందుభోజనాల వివరాలు ప్రింట్ చేసిన వారి పెళ్లి ఆధార్‌ కార్డు ను చూసి బంధువులంతా షాకవుతున్నారు. దీనిమీద సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ కాలంలో పెళ్లికి రావాలంటే కూడా ఆధార్‌ కార్డు తప్పనిసరి అయ్యందని కొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తే.. మరికొంత మంది అయ్యయ్యో మా అధార్ కార్డ్ డైనింగ్ టేబుల్ దగ్గరే మర్చిపోయాం అంటూ సెటైర్లు వేస్తున్నారు.