అతను ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అయితే.. అతని ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వేరే యువతితో బలవంతంగా వివాహం జరిపించారు. దీంతో.. తీవ్ర మానసిక వేధనకు గురై.. తాను ప్రేమించిన ప్రియురాలితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా వేపనపల్లి సమీపంలోని కే. కొత్తూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ సురేష్‌(24), బొమ్మరసనపల్లి గ్రామానికి చెందిన బాలరాజ్‌ కూతురు భవాని(18)లు ఏడాదిగా ప్రేమించుకున్నారు. అయితే, సురేష్‌ కుటుంబ సభ్యులు వీరి ప్రేమపై అయిష్టత వ్యక్తం చేస్తూ నాలుగు నెలల క్రితం సురేష్‌కు వేరే యువతితో పెళ్లి జరిపించారు. 

ఇష్టం లేని పెళ్లి జరగడంతో సురేష్‌ రెండు రోజుల క్రితం తన ప్రేయసితో కలిసి ఇల్లు వదిలి వెళ్లి పారిపోయారు. కాగా, హోసూరు– క్రిష్ణగిరి జాతీయ రహదారిలోని కుందారపల్లి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు వారిని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భవానీ మంగళవారం మృతి చెందింది. సురేష్‌ను మెరుగైన చికిత్స కోసం కోలారుకు తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై క్రిష్ణగిరి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.