దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన మూడు  హత్యల కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న విష్ణుకుమార్, శశి మాథుర్ వృద్ధ దంపతులు గతంలో ప్రభుత్వోద్యోగులుగా పనిచేసి పదవి విరమణ చేశారు.

వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంగా ఉండటంతో కుష్భూ నత్యాల్ అనే నర్స్ ‌ వారికి సేవలు చేస్తోంది. గత ఆదివారం వీరు ముగ్గురు రక్తపు మడుగులో విగత జీవులుగా పడివున్నారు. నగరంలోని సంచలనం సృష్టించిన ఈ హత్యపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు.

సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఆదివారం తెల్లవారుజామున ఒక మహిళ, మరో వ్యక్తితో కలిసి మాథుర్ ఫ్లాట్‌వైపు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. వీటి ఆధారంగా ఆరా తీయగా.. మృతులకు క్లోజ్ ఫ్రెండ్‌గా ఉంటున్న ప్రీతి షెరావత్ తన ప్రియుడు మనోజ్ భట్‌తో కలిసి వృద్ధ దంపతులను చంపి ఇంటిలోని విలువైన నగలు, నగదును దోచుకెళ్లారు.

దంపతులను కాపాడేందుకు ప్రయత్నించిన నర్స్‌‌ను 35 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచారు. అనంతరం ఇళ్లు గుళ్ల చేసి పరారయ్యారు. బుధవారం ఉదయం పోలీసులు ప్రీతి, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నారు.