politics of hate: "దేశంలో ద్వేషంతో నిండిన విధ్వంస ఉన్మాదాన్ని మనం చూస్తున్నామని ప్ర‌ధాని మోడీకి 100 మంది మాజీ బ్యూరోక్రాట్లు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ముస్లింలు, ఇతర మైనారిటీలతో పాటు రాజ్యాంగాన్ని సైతం బ‌లిపీఠం ముందు తెచ్చింద‌ని లేఖ‌లో తెలిపారు. 

ex-bureaucrats write to PM Modi: దేశంలో ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు ప్ర‌ధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. దేశంలో ద్వేషంతో నిండిన విధ్వంస ఉన్మాదాన్ని మనం చూస్తున్నామని పేర్కొన్నారు. ముస్లింలు, ఇతర మైనారిటీలతో పాటు రాజ్యాంగాన్ని సైతం బ‌లిపీఠం ముందు వ‌చ్చింద‌ని లేఖ‌లో తెలిపారు. ముఖ్యంగా భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రాల్లో ఈ ధోర‌ణులు మ‌రింత‌గా పెరుగుతున్నాయ‌ని ఆందోళన వ్య‌క్తం చేశారు. ముస్లింలు, ఇతర మైనారిటీలతో పాటు రాజ్యాంగాన్ని సైతం ధ్వంసం చేస్తున్న ఇలాంటి చర్యలకు ముగింపు పలికేలా చొరవ తీసుకోవాలని ప్రధాని మోడీని ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు కోరారు. 

ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జికె పిళ్లై, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టికెఎ నాయర్ సహా 108 మంది మాజీ ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు ఈ లేఖపై సంతకాలు చేశారు. అసోం, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ధోర‌ణి పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

"ఈ సంవత్సరం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో, పక్షపాత పరిశీలనలకు అతీతంగా, మీ పార్టీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు చాలా పట్టుదలతో ఆచరిస్తున్న విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలని మీరు పిలుపునిస్తారని మా ఆశ" అంటూ లేఖ‌లో ప్ర‌భుత్వ మాజీ ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. దేశంలో విద్వేష రాజకీయాలకు ముగింపు పలుకాలని విజ్ఙప్తి చేశారు. 

ఇదిలావుండ‌గా, దేశంలో ఇటీవల జరిగిన విద్వేషపూరిత ప్రసంగాలు మరియు మత హింసాత్మక సంఘటనలపై 13 ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు ఈ నెల 16న తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. దేశంలో చోటుచేసుకుంటున్న మ‌త‌ప‌ర‌మైన హింసాత్మ‌క ఉద్రిక్త‌ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మౌనంగా ఉండ‌టం దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని దేశంలోని 13 ప్ర‌తిప‌క్ష రాజ‌కీయ పార్టీలు పేర్కొన్నాయి. ప్ర‌ధాని మౌనం ఈ విధ‌మైన దాడుల‌కు దిగే మూక‌ల‌కు ఈ తీరు అధికారి ప్రోత్సాహం అందించే విధంగా ఉందంటూ ఆయా పార్టీల ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న పేర్కొంది. శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, మత హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

దేశంలోని 13 ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష పార్టీలు భార‌త్ లో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలు మరియు మత హింసాత్మక సంఘటనలపై ప్ర‌ధాని మోడీ తీరును ప్ర‌స్తావిస్తూ.. ఒక సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి. ఈ సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, NCP అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నాయ‌కుడు MK స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌లతో సహా చాలా మంది నేతలు మ‌త సంబంధిత ఉద్రిక్త‌ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల ఆహారం, వేషధారణ, విశ్వాసం, పండుగలు మరియు భాష సమాజాన్ని ధ్రువీకరించడానికి పాలక వ్యవస్థ ద్వారా కొన‌సాగుతున్న చ‌ర్య‌లు ఆందోళ‌న‌క‌ర‌మైన‌వ‌ని పేర్క‌న్నారు.