కరోనా వైరస్ ని పూర్తిగా నయం చేస్తుందంటూ బాబా రాందేవ్ కొరొనిల్ టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ సహా మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు పోలీసులు. 

మంగళవారం నాడు బాబా రాందేవ్ కొరొనిల్ ని కరోనాని నయం చేసే టాబ్లెట్ అంటూ ప్రచారం చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఆయుష్ మంత్రాలయం కూడా ఈ టాబ్లెట్ ని కరోనా ముందుగా ప్రచారం చేయకూడదని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

దీనిపై జైపూర్ లోని జ్యోతినగర్ ఠాణా పరిధిలో కేసు నమోదయింది. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సైంటిస్ట్ అనురాగ్, నిమ్స్ చైర్మన్ బల్బీర్ సింగ్ తోమర్, డైరెక్టర్ అనురాగ్ తోమర్ లపై కేసు నమోదయింది. 

ఇకపోతే బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలపై బీహార్ లో క్రిమినల్ కేసు కూడా దాఖలయింది. కోర్టు దాన్ని విచారణకు చేపట్టింది కూడా. ఈ నెల 30వ తేదీన ఆ కేసు వాదనకు రానుంది. 

ఇకపోతే... ఈ కొరొనిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పతంజలి తరుపున ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ... కరోనాను ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చని తాము విశ్వసిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన మెడిసన్ రెడీ చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టుగా ఆయన తెలిపారు. 

హరిద్వార్ లోని పతంజలి యోగా పీఠ్ వేదికగా ఈ మెడిసిన్ శాస్త్రీయత గురించి వెల్లడించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ మెడిసిన్ తో కరోనా సోకిన రోగులు నాలుగైదు రోజుల్లో కోలుకొంటున్నట్టుగా ఆయన తెలిపారు.ఈ మెడిసిన్‌కు స్వసరీ వాటి, కరోనిల్ అని నామకరణం కూడా చేశారు. 

కరోనాను నిరోధించేందుకు గాను దేశంలో ఇప్పటికే గ్లెన్ మార్క్ సంస్థ టాబ్లెట్లను విడుదల చేసింది. హైద్రాబాద్ హెటిరో సంస్థ కూడ ఇంజక్షన్ రూపంలో కరోనాకు మందును కనిపెట్టినట్టుగా ప్రకటించింది.కరోనాకు చెక్ చెప్పేందుకు మొదటి ఆయుర్వేద ఆధారిత ఆయుర్వేద ఔషధం తామే రూపొందించినట్లు తెలిపారు.