ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ విధిస్తూ వచ్చాయి. దాదాపు రెండు నెలల పాటు  లాక్ డౌన్ కొనసాగుతూ రావడంతో.. తాజాగా అన్ని దేశాలు ఎత్తివేస్తూ వస్తున్నాయి. భారత్ లోనూ లాక్ డౌన్ లో భారీ సడలింపులు చేశారు. ఈ నేపథ్యంలో.. డబ్ల్యూహెచ్ఓ తాజా సూచనలు జారీ చేసింది.

ఫేస్ మాస్క్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త సూచన చేసింది. జనం మధ్య ఉన్న సమయంలో ముఖానికి మాస్క్‌ను పెట్టుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇది తప్పనిసరి అని పేర్కొంది. వైరస్ మోకెళ్తున్న తుంపర్ల నుంచి మాస్క్ రక్షణ కల్పిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా సూచనల్లో అభిప్రాయపడింది. 

వాస్తవానికి కొన్ని దేశాలు ఇప్పటికే బహిరంగప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆరోగ్యంగా ఉన్న ప్రజలు కూడా మాస్క్ పెట్టుకోవాలన్న ఆధారాలు తమ వద్ద ఏమీ లేవని గతంలో డబ్ల్యూహెచ్‌వో వాదించినా..వైరస్ వ్యాప్తి జరిగే రిస్క్ ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్క్‌ను పెట్టుకోవాలని డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ నిపుణులు డాక్టర్ మారియా వాన్ కెర్కోవ్ తెలిపారు. అనారోగ్యంగా ఉన్న వారు మెడికల్ ఫేస్ మాస్క్‌లను ధరించాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.