కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికి[పోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది. 

భారతదేశంపై కూడా కరోనా పంజా బలంగా పడింది. ఇప్పటికే ఒకరకంగా భారతదేశమంతటా షట్ డౌన్ వాతావరణం కనబడుతుంది. కరోనా మహమ్మారి దెబ్బకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయ్యాయి. 

ప్రధాని నరేంద్ర మోడీ రేపు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ లో యావత్ తెలంగాణ పాల్గొంటుందని, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం 5 గంటలకు వచ్చి చప్పట్లు కొట్టమని కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

ఇలా కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు కష్టపడుతున్న వారందరికీ చిన్న ఉద్యోగి దగ్గరి నుండి డాక్టర్ వరకు అందరికి థాంక్స్ చెప్పడానికి ఇలా చప్పట్లు కొట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

ఇలా చప్పట్లు కొడితే... కరోనా వైరస్ దెబ్బకు కుదేలయున్న మన ఆర్ధిక వ్యవస్థ పుంజుకోలేదని, పేదలకు ఎటువంటి లాభం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు. 

అసలే క్షీణిస్తున్న మన దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ఈ కరోనా పిడుగులాగా పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ ను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నవారి అభినందనార్థం చప్పట్లు కొట్టాలని ప్రధాని మోడీ ఇఛ్చిన పిలుపు అర్థ రహితమని  అని ఆయన ఎద్దేవా చేశారు. 

చప్పట్లు కొట్టినంత మాత్రాన రోజువారీ వర్కర్లకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసేవారికి ఎలాంటి ఉపయోగం ఉండబోదని, వారికి చప్పట్లు ఎలాంటి సాయం చేయబోవని రాహుల్ ట్వీట్ చేశారు. 

ఇవాళ్టి రోజున మనకు కావలసింది భారీ ఆర్ధిక ప్యాకేజీ అని, పన్నుల్లో మినహాయింపులు కావాలని, అలాగే  రుణాల చెల్లింపులో రాయితీలు కావాలని రాహుల్ గాంధీ అన్నారు.