మూడు రోజులుగా ఒడిశాకు రిలీఫ్: ఇండియాలో కొత్త కేసులు 991, మరణాలు 43
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 14 వేలకు పైగా చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 480కి చేరుకుంది. ఒడిశాలో గత మూడు రోజులుగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు.
హైదరాబాద్: భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 991 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 14,378కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 43 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 448కి చేరుకుంది.
ఒడిశాకు కొంత ఊరట లభించింది. గత మూడు రోజులుగా ఒడిశాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెంపులో తగ్గుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి తగ్గిందని చెప్పింది.
రికవరీ రేటు శనివారం అత్యధికంగా నమోదైంది. మహారాష్ట్ర కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతూనే ఉన్నది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 286 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంంబైలోనే 177 కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 194కు చేరుకుంది.
ఇండియన్ నేవీలో 20 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.తెలంగాణలో 766 కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు.