న్యూఢిల్లీ: లాక్ డౌన్ తీవ్రతను ప్రజలు తీవ్రంగా తీసుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోకుండా లాక్ డౌన్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రతిస్పందించారు. 

ఆంక్షలను కఠినంగా పాటించి మిమ్ముల్ని, మీ కుటుంబాలను రక్షించుకోవాలని ఆయన కోరారు. నియమాలను, చట్టాలను కఠినంగా అమలు చేయాలని, అవి అమలయ్యేలా చూడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.

 

మన దేశంలో కరోనా మృతుల సంఖ్య 8కి చేరింది. మహారాష్ట్రలో తాజాగా మరో వ్యక్తి మరణించాడు. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడి మరణించినవారి సంఖ్య 3కు చేరుకుంది. తాజాగా పిలిప్పైన్స్ కు చెందిన ఓ వ్యక్తి ముంబైలో మరణించాడు 

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 396కి చేరుకుంది. ఆదివారంనాడు మూడు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆదివారం ఒక్కరేసి మరణించారు. కరోనాను కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఆంక్షల ప్రభావం పడకుండా నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్తిక సాయం ప్రకటించాయి.