కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ ఎత్తివేత వంటి పలు అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఈ సమావేశం ఉండే అవకాశం ఉంది.

అందరూ సీఎంలతో ఒకేసారి కాకుండా ముఖ్యమంత్రులను రెండు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూప్‌తో ఒక్కో రోజు చర్చలు జరుపుతారని కేంద్ర వర్గాల సమాచారం. దీనిలో భాగంగా 16న నిర్వహించే జాబితాలో ఏపీ, 17వ తేదీ జాబితాలో తెలంగాణ ఉన్నట్లు సమాచారం.

దేశంలో రోజుకు 10 వేల చొప్పున కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో మరోసారి లాక్‌డౌన్ తప్పదా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

గత 24 గంటల్లో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  అత్యధికంగా 10,956 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. కాగా నిన్న ఒక్కరోజే  396 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

భారత్ తో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 1,47,195 నయమై కోలుకున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ మహమ్మారి బారిన పడి 8,498 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,97,535కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అటు మహారాష్ట్రంలో కోవిడ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం 97,648మందికి కరోనా సోకగా… 3,590మంది కరోనాతో మరణించారు. 

తమిళనాడులో 38,716 కరోనా కేసులుండగా… 349 మంది మృతి చెందారు. దేశరాజధాని ఢిల్లీలో 34,687మంది కోవిడ్ బారిన పడగా.. 1,085మందిని కరోనా కబలించింది. గుజరాత్ లో 22,067మందికి కరోనా బారిన పడగా… 1,385 మంది చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పదివేలు దాటడం ఇదే తొలిసారి.