కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. దీనిని అరికట్టాలంటే సామాజిక దూరం ఒక్కటే పరిష్కారం అని భావించి లాక్ డౌన్ లు విధిస్తున్నారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా చాలా మంది అవస్థలు పడుతున్నారు. మనిషి ప్రాణం పోయినా చివరి చూపు చూడటానికి కూడా ఎవరూ రావడానికి వీలు లేకుండా పోతోంది. 

కనీసం అంత్యక్రియలు కూడా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఓ వ్యక్తికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కరోనాతో ఓ వ్యక్తి చనిపోతే.. అంత్యక్రియలకు కూడా ఎవరూ రాకపోవడంతో అతని భార్యే చితికి నిప్పు పెట్టింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 వివరాల్లోకి వెళితే  కరోనా బాధితుడు అమిత్ అగర్వాల్ భోపాల్ లోని హమీడియాలోని ఆసుపత్రిలో మృతి చెందాడు. అతను తన తండ్రితో పాటు రైసన్ లో టిఫిన్ సెంటర్‌ను నడుపుతున్నాడు. 

ఆరోగ్యం విషమంగా ఉండటంతో బుధవారం ఆసుపత్రిలో చేర్పించారు. మృతుడి భార్య వర్ష సహకారి బ్యాంకులో పనిచేస్తోంది. తన భర్త మరణం గురించి సమాచారం అందుకున్న ఆమె భర్తకు తానే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. కరోనా అనుమానంతో అమిత్ సోదరుడు కూడా హమిడియా ఆసుపత్రిలో చేరాడు. 

మృతుని పిల్లలు ఇద్దరూ రాజధాని భోపాల్‌లో ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వర్ష అనుమతి కోరింది. అయితే అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. దీనితో వర్ష స్వయంగా భర్తకు సామాజిక దూరం పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించింది.