Asianet News TeluguAsianet News Telugu

15 స్పెషల్ ట్రైన్‌లు.. పది నిమిషాల్లో టిక్కెట్లు ఖాళీ

లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఎగబడటంతో టిక్కెట్లన్నీ పది నిమిషాల్లోనే అయిపోయాయి. 

coronavirus IRCTC opens booking for special trains tickets sold within 10 minutes
Author
New Delhi, First Published May 11, 2020, 9:13 PM IST

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా భారతీయ రైల్వే దశల వారీగా తన సేవలను పునరుద్ధరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి 15 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

అయితే లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఎగబడటంతో టిక్కెట్లన్నీ పది నిమిషాల్లోనే అయిపోయాయి. సాయంత్రం 6 గంటలకు న్యూఢిల్లీ-హౌరా రైలులోని ఏసీ 1, ఏసీ 3 టైర్ బోగీల్లోని టికెట్లన్నీ పది నిమిషాల్లో అయిపోయాయి.

మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు ఈ రైలు ఢిల్లీ నుంచి బయల్దేరనుంది. ఈ ఒక్క బండే కాదు మిగిలిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ టిక్కెట్లన్నీ అయిపోయాయి. అంతకుముందు సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపింది.

రైల్వేశాఖ ప్రకటనతో రిజర్వేషన్ కోసం ప్రయత్నించిన వారికి నిరాశే ఎదురైంది. సైట్ క్రాష్ అయినట్లు వార్తలు వచ్చాయి. మళ్లీ కొద్దిసేపటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీనిపై గందరగోళం నెలకొనడంతో రైల్వేశాఖ స్పష్టత ఇచ్చింది.

ఐఆర్‌సీటీసీ సైట్ క్రాష్ కాలేదని వెల్లడించింది. మరోవైపు ఈ ప్రత్యేక రైళ్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఏడు రోజుల ముందస్తు రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతించామని, ఖరారైన టికెట్లు మాత్రమే జారీ చేస్తామని రైల్వే శాఖ తెలిపింది.

వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ ఉండవని వివరించింది. టికెట్ల రద్దు కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలని స్పష్టం చేసింది. క్యాటరింగ్ ధరలను టికెట్ల ఛార్జీల్లో కలపడం లేదని, ఆహారాన్ని బుక్ చేసుకునే సదుపాయాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోందని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios