భారతదేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. భారతదేశంలో మరణాలు 50 వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 58 వేల కరోనా కేసులు  నమోదవడంతో.... భారత్ లో కరోనా కేసుల సంఖ్య కూడా 26 లక్షలను దాటింది. 

గడిచిన 24 గంటల్లో 941 మంది మరణించారు. గత వారమే భారత్ కరోనా మరణాల్లో బ్రిటన్ ని వెనక్కి నెట్టి నాలుగవ స్థానంలో నిలిచింది. అమెరికా, బ్రెజిల్, మెక్సికోలు మాత్రమే కరోనా వైరస్ వల్ల కలుగుతున్న మరణాల్లో మనకన్నా ముందున్నారు. కరోనా తో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 

ఇప్పటివరకు దాదాపుగా 19.19 లక్షల మంది కరోనా వైరస్ పేషెంట్స్ కోలుకున్నారు. రికవరీ రేటు కూడా 72.51 శాతానికి ఎగబాకడం కొంత నయంగా కనబడుతుంది. కరోనా కేసుల్లో మూడవ స్థానంలో ఉన్న భారత్... రోజువారీ కేసుల్లో మాత్రం తొలి రెండు స్థానాల్లో ఉన్న అమెరికా, బ్రెజిల్ ను దాటేసి గత 13 రోజులుగా అత్యధిక రోజువారీ కేసుల రికార్డును నమోదు చేస్తుంది. 

ఇకపోతే... వచ్చే ఏడాది ఆరంభంలోనే కరోనా కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌసీ అభిప్రాయపడ్డారు. 

శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ప్రథమంలో వ్యాక్సిన్ ను కచ్చితంగా అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. టీకా ఆవిష్కరణ ప్రక్రియన వచ్చే ఏడాదిలోపుగానే పూర్తి చేయాలన్నారు. అంతకంటే ఎక్కువ సమయం తీసుకోవద్దన్నారు.

వచ్చే ఏడాదిలోపుగా కరోనాకు వ్యాక్సిన్ రాకపోతే మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఏదాదిలోపుగా ప్రపంచాన్ని సాధారణస్థితికి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ ఏడాది నవంబర్ లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ సూచించారు. కానీ సాధరణ ప్రజలకు వ్యాక్సిన్ చేరడానికి 2021 ఆరంభం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ సురక్షితమైందో , ప్రభావితంగా పనిచేస్తోందో కూడ పరిశీలించిన తర్వాతే దానిని ప్రజలకు అందించాలని రష్యా టీకాపై ఆయన వ్యాఖ్యలు చేశారు.