న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మృతుల సంఖ్య 8కి చేరింది. మహారాష్ట్రలో తాజాగా మరో వ్యక్తి మరణించాడు. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడి మరణించినవారి సంఖ్య 3కు చేరుకుంది. తాజాగా పిలిప్పైన్స్ కు చెందిన ఓ వ్యక్తి ముంబైలో మరణించాడు

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 396కి చేరుకుంది. ఆదివారంనాడు మూడు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆదివారం ఒక్కరేసి మరణించారు. కరోనాను కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఆంక్షల ప్రభావం పడకుండా నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్తిక సాయం ప్రకటించాయి.

దేశంలో పాక్షికంగా షట్ డౌన్ అమలవుతోంది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాలకు పైగా రవాణా సౌకర్యాలు బందయ్యాయి. ఢిల్లీ, పంజాబ్, జార్ఖండ్, నాగాలాండ్, తెలంగాణ రాష్ట్రాలు షట్ డౌన్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2,08,206కు చేరుకుంది. ఇటలీ, చైనాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో కరోనావైరస్ కేసుల సంఖ్య ఏడుకు చేరుకుంది.  49 సంవత్సరాల మహిళకు తాజాగా పాజిటివ్ వచ్చింది. ఈ మహిళ విశాఖపట్నంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కుటుంబసభ్యురాలు.

తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు పాజిటివ్ కేసు వ్యక్తికి తాజా పరీక్షలలో ఉపశమనం లభించింది. రెండు సార్లు నిర్వహించిన పరీక్షలలో నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరులో ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తిని త్వరలో డిశ్చార్జ్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 

విదేశాల నుంచి వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి 13,301 మంది వచ్చారని ప్రభుత్వం తెలిపింది.