న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఆగే సూచనలు కనపించడం లేదు. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 2,293 కేసులు కొత్తగా బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 37,336కు చేరుకుంది. గత 24 గంటల్లో 71 మంది కోవిడ్ -19తో మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1218కి చేరుకుంది. 

ఇప్పటి వరకు దేశంలో 9951 మంది కరోనా వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 26,167 ఉంది. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 

మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 11,506కు చేరుకుంది. మహారాష్ట్రలో 485 మంది కరోనా వైరస్ తో మృత్యువాత పడ్డారు.

గ్రేటర్ నోయిడాలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మరో 19 మందిపై కేసులు నమోదు చేశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇఫ్తార్ విందు నిర్వహించినందుకు ఆ చర్యలు తీసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో తొలి కరోనా వైరస్ మరణం సంభవించింది. మృతి చెందిన 62 ఏళ్ల వ్యక్తి విశాఖపట్నంలోని చెంగల్రావుపేటకు చెందినవాడు.