దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది.  కాగా.. గత 24గంటల్లో 15వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15968 పాజిటివ్‌ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు. 

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,56,183 కరోనా కేసులు నమోదు కాగా.. 14,476 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకొని 2,58,685 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,83,022 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. 

గడిచిన 24 గంటల్లో 2,15,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటివరకు 73,52,911 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

 ప్రపంచవ్యాప్తంగా 93.59 లక్షల మంది ఈ కరోనా మహమ్మారి బారిన పడగా.. 4.79 లక్షల మంది మరణించారు. అత్యధిక కరోనా కేసులతో అమెరికా (24.42 లక్షలు) అగ్రస్థానంలో ఉండగా. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌ (11.51 లక్షలు), రష్యా (5.99లక్షలు) దేశాలు ఉన్నాయి. అత్యధిక కరోనా కేసులు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.