భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.  ప్రతిరోజూ దాదాపు 60వేల కేసులు నమోదౌతున్నాయి. గడిచిన 24గంటల్లోనూ 60వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 61,408 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో.. దేశంలో కరోనా కేసులు 31లక్షలు దాటేశాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,06,348కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

వీరిలో ఇప్పటి వరకు 23లక్షల 38వేల మంది కోలుకోగా.. మరో 7లక్షల మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 836మంది కోవిడ్ బారిన పడి మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 57,542కి చేరింది. అయితే.. దేశంలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ... కోలుకునే వారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉండటం విశేషం. నిన్న మరో 57వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 75శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల శాతం 23.4 ఉండగా.. మరణాల రేటు 1.86శాతంగా ఉంది. అయితే.. దేశంలో కరోనా కేసులు ఈ ఆగస్టు నెలలో మరింత ఎక్కువగా పెరగడం గమనార్హం. వారానికి తక్కువలో తక్కువ 4లక్షల కేసులు నమోదౌతుండటం అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది.

గడిచిన వారం రోజుల్లో 4.5లక్షల మందికి కరోనా సోకగా.. 6,600ల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 20లక్షల నుంచి కరోనా కేసులు 30లక్షలకు చేరుకోవాడానికి 15 రోజులు కూడా పట్టలేదు. దీనిని బట్టి.. దేశంలో కరోనా మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.